ఎల్లారెడ్డి, జూలై 9: ఎల్లారెడ్డిలో గత నెల 30న జరిగిన రమేశ్ (25) హత్యకు అతని భార్య వివాహేతర సంబంధమే కారణమని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన సందర్భంగా శనివారం సాయంత్రం ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన రమేశ్ భార్య వెన్నెలతో కలిసి హైదరాబాద్‌లోని లింగంపల్లిలో కూలీ పని చేసుకునే వారు. అక్కడ పని చేస్తుండగా వికారాబాద్ ప్రాంతానికి చెందిన దస్తప్పతో వెన్నెలకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది.
అక్కడ పలుమార్లు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. అక్కడ కూలీ పని పూర్తికావడంతో భవన నిర్మాణ పనుల కోసం రమేశ్ భార్య వెన్నెల, ముగ్గురు పిల్లలతో కలిసి ఎల్లారెడ్డికి వచ్చారు. ఈక్రమంలో గతనెల 30న దస్తప్ప ఎల్లారెడ్డికి వచ్చి వెన్నెలతో మాట్లాడుతుండగా రమేశ్ చూసి వారితో గొడవ పడ్డాడు. అనంతరం రాత్రి పది గంటల సమయంలో వెన్నెల, దస్తప్ప కలిసి రమేశ్ గొంతుకు కొబ్బరి తాడు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని తాము పనిచేస్తున్న ఇంటి ఆవరణలో గుంత తీసి పాతిపెట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. వారిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్ పాల్గొన్నారు.
అధికారులను అభినందించిన డీఎస్పీ..
హత్య కేసును త్వరగా ఛేదించిన సీఐ శ్రీనివాస్, ఎస్సై గణేశ్‌ను డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. నిందితులు దస్తప్ప, వెన్నెల హైదరాబాద్‌లోని లింగంపల్లిలో పనిచేస్తుండగా సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. హత్య జరిగిన వెంటనే స్పందించి త్వరగా నిందితులను పట్టుకోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమని డీఎస్పీ అభినందించారు.