నిజామాబాద్, జూలై 9,(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని చారిత్రక ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న అతి భారీ వానలతో గోదావరిపై నిర్మించిన ఎస్సారెస్పీలోకి వరద పోటెత్తింది. మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సింగీతం ప్రాజెక్టు నిండి అలుగు పారుతోంది. కల్యాణి ప్రాజెక్టు నిండగా మూడు వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. కందకుర్తి త్రివేణి సంగమం వద్ద భారీ ప్రవాహం నెలకొంది. చారిత్రక శివాలయం నీటిలో మునిగింది. ఎస్సారెస్పీకి ఒక రోజు వ్యవధిలో వరద అమాంతం లక్షా 71వేల 500 క్యూసెక్కులకు పెరిగింది. మహారాష్ట్రలోని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడంతో వరద పెద్ద ఎత్తున ఎస్సారెస్పీకి వచ్చి చేరుతోంది. కౌలాస్‌నాలా ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
లక్షా 71వేల 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో…
ఐదు రోజుల క్రితం ఎస్సారెస్పీకి ఎగువ నుంచి 12వేల క్యూసెక్కు వరద వచ్చింది. శుక్రవారం ఉదయం 25వేల క్యూసెక్కులు ఉండగా శనివారం ఉదయం 35వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. శనివారం మధ్యాహ్నం 12గంటలకు 55వేల క్యూసెక్కులు, మధ్యాహ్నం 3గంటలకు 98వేల క్యూసెక్కులు, రాత్రి 9 గంటలకు లక్షా 71వేల 500 క్యూసెక్కుల వరద ఎస్సారెస్పీలోకి చేరుతోంది. గంటగంటకూ ఇన్‌ఫ్లో పెరుగుతోంది. వాగులు, వంకల గుండా జీవనదికి వస్తున్న వరదతో ఉధృతి క్రమంగా పెరుగుతోంది. నిజామాబాద్, నిర్మల్ సరిహద్దు ప్రాంతం యంచ బ్రిడ్జి వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వానలు ఇదే స్థాయిలో కురిస్తే కొద్ది రోజుల్లోనే ప్రాజెక్టు నిండుకుండలా మారుతుంది.
మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ చారిత్రక ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో కొద్ది మొత్తంలో కొనసాగుతోంది. ఎగువ సింగూర్ ప్రాజెక్టులోకి వరద భారీగానే మొదలైంది. గతేడాది ఈ సమయానికి ఇరు ప్రాజెక్టుల్లోనూ ఇన్‌ఫ్లో నామ మాత్రంగానే కనిపించగా ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా ఉంది. సింగూర్‌లో 29.917 టీఎంసీల సామర్థ్యానికి 19.411 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువ సంగారెడ్డి ప్రాంతాల్లో భారీ వానలు కురిస్తే కొద్ది రోజుల్లోనే సింగూర్ నిండుకుండలా మారుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే గేట్లు ఎత్తితే మంజీరా ప్రవాహం భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పోచారం ప్రాజెక్టు కొద్ది పాటి వానలతోనే ఈసారి నిండుకుండను తలపిస్తోంది.