రుద్రూర్, జూలై 8: దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని రాయకూర్ క్యాంపు గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. గ్రామంలో రూ.10లక్షలతో నిర్మించిన రామాలయం కల్యాణ మండపం, రూ. 30లక్షలతో నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాలును ప్రారంభించారు. అనంతరం తమ సొంత ఖర్చులతో నిర్మించి ఇచ్చిన వంటశాలను దాత కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జనరల్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సభలో సభాపతి మాట్లాడారు. పాలిచ్చే పాడిని, పండ్లు ఇచ్చే చెట్టును కాపాడుకోవాలన్నారు. ముళ్ల పొదను నమ్ముకుంటే నష్టమే వాటిల్లుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్ ఆలోచనతో పాలించే వాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల పథకం సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి వచ్చిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలని ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీటి ట్యాంకర్‌ను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సుమారు కోటి రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు. స్వరాష్ట్రంలో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు చెప్పారు. ఆరు లక్షల మందికి ఐటీ ఉద్యోగాలతో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. దేశం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన చేసి పాలన కొనసాగించినప్పుడే అభివృద్ధి కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నిర్మలా రమేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, జడ్పీటీసీ నారోజి గంగారాం, ఎంపీపీ అక్కపల్లి సుజాత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ సంగమేశ్వర్, రైతుబంధు సమతి మండల కన్వీనర్ సంగయ్య, ఏఈ నాగేశ్వర్రావు, కో-ఆప్షన్ మెంబర్ మస్తాన్, తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో బాలగంగాధర్, ఎంపీటీసీ అనిల్ పటేల్, ఏసీపీ రామారావు, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
మహిళా భవన నిర్మాణానికి రూ. 30 లక్షలు
వర్ని, జూలై 8: వర్ని మండల కేంద్రంలోని మహిళా మండలి భవనాన్ని స్పీకర్ పోచారం శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవన నిర్మాణానికి రూ. 30లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధుల కేటాయింపుపై స్పీకర్‌కు మహిళలు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.