శక్కర్‌నగర్, జూలై 3: కల్తీకల్లు తయారీకి వినియోగించే అల్ఫాజోలం అనే మత్తు పదార్థాన్ని ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు భారీగా పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 2న సాయంత్రం హైదరాబాద్ నుంచి టాస్క్‌ఫోర్స్ బృందం కుర్నాపల్లి గ్రామంలోని ఓ ఇంటిపై దాడి చేసింది. విక్రయానికి సిద్ధంగా ఉంచిన కిలో 430 గ్రాము ల అల్ఫాజోలం ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని దానిని నిల్వచేసిన నిమ్మపల్లి యోగేశ్వర్గౌడ్ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడి సోదరుడు నిమ్మపల్లి మహేశ్‌గౌడ్‌తో కలిసి కల్తీకల్లు తయారుచేసేవారికి కొంతకాలంగా అల్ఫాజోలంను విక్రయిస్తున్నట్లు వి చారణలో తెలిసిందని అధికారులు చెప్పారు. ఈ మత్తు పదార్థాన్ని చెన్నైకి చెందిన మురుగన్, శివకుమార్, ఆకాశ్ హైదరాబాద్ వరకు తెచ్చి ఇచ్చేవారని, అక్కడి నుంచి మహేశ్ గౌడ్, యోగేశ్వర్గౌడ్.. కుర్నాపల్లి శివారుకు తరలించి స్థానికులకు విక్రయించేవారని నిర్ధారించారు. పట్టుబడిన అల్ఫాజోలం విలువ బయటి మార్కెట్లో దాదాపు రూ.10లక్షలకు పైగా ఉంటుందని చెప్పారు. యోగేశ్వర్గౌడ్ను రిమాండ్‌కు తరలించారు. మిగతా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దాడిలో టాస్క్‌ఫోర్స్ సీఐలు చిరంజీవి, నరేందర్, ఎస్సై శివకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామంలో తనిఖీలు..
కుర్నాపల్లి శివారులోని ఓ ఇంట్లో అల్ఫాజోలం లభ్యం కావడంతో ఆదివారం సైతం గ్రామంలోని మరికొందరి ఇండ్లల్లో స్థానిక ఎక్సైజ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తి ఫిర్యాదు మేరకు పలువురి ఇండ్లను తనిఖీ చేశామని ఎక్సైజ్ సీఐ పీర్సింగ్ చెప్పారు. వారి వద్ద ఎలాంటి మత్తు పదార్థాలు లభ్యం కాలేదని తెలిపారు.