బాన్సువాడ రూరల్, జూన్ 18 : నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు.. పిల్లలకు తొలి నేస్తం తండ్రి. నాన్న గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. తన జీవితాన్ని పిల్లల కోసం ధారబోసి ఎప్పుడూ వెన్నంటే ఉండి నడిపిస్తాడు నాన్న. తప్పటడుగులు వేసే వయస్సు నుంచే వెన్నంటి ఉంటాడు. తప్పుడు అడుగులు వేస్తే మంచి మార్గాన్ని చూపిస్తాడు.. బిడ్డ గెలుపే తండ్రికి నిజమైన విజయం. పిల్లలు గెలిస్తే సంతోషించి, ఓడితే ధైర్యం చెప్పే హీరో నాన్న.. ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా పిల్లలకు దిశానిర్దేశం చేస్తాడు నాన్న. అలాంటి తండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతీ బిడ్డపై ఉంది. జూన్ మూడో అదివారం ప్రపంచ ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..
ఫాదర్స్ డే నేపథ్యం
మాతృదినోత్సవం సందర్భంగా తల్లిని ఏ విధంగా గౌరవిస్తామో, బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతి రూపంగా 1910లో మొదటి సారి ఫాదర్స్ డేను నిర్వహించారు. అనంతరం నాన్నల దినోత్సవానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ఏటా జూన్ మూడో అదివారాన్ని ఫాదర్స్ డేగా నిర్వహిస్తున్నాయి. బిడ్డలు తండ్రులకు గిఫ్ట్లు అందించి నాన్నకు శుభాకాంక్షలు తెలుపుతూ తండ్రిపై తమ ప్రేమను వ్యక్త పరుస్తున్నారు.
బిడ్డలకు మార్గ దర్శకుడిగా..
ప్రతి తండ్రి ఎంత ఒత్తిడి ఉన్నా తన పిల్లలను చూసి ఆనందం పొందుతుంటాడు. పిల్లలే లోకంగా భావిస్తూ వారి బంగారు బాటకు పునాదులు వేస్తుంటాడు. చిన్పప్పుడు వేలుపట్టుకొని నడక నేర్పుతాడు. పెద్దయ్యాక తప్పుడు అడుగులు వేస్తే మంచి మార్గాన్ని చూపిస్తూ ముందుకు సాగుతాడు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం శ్రమించే గొప్ప వ్యక్తి తండ్రి.
తల్లిదండ్రులను గౌరవించినప్పుడే..
తల్లిదండ్రులను గౌరవించినప్పుడే ప్రతి బిడ్డకూ సమాజంలో గుర్తింపు వస్తుంది. మారుతున్న సమాజంలో తల్లిదండ్రులపై కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. బిడ్డ ఎదుగుదలకు నిరంతరం శ్రమించే తండ్రిని కొందరు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదు. దీంతో చాలా మంది తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. అందరూ తల్లిదండ్రులను గౌరవిస్తూ తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి.
ఐదేళ్లలోపు పిల్లలు, తండ్రులకు నేడు ఉచిత ప్రయాణం
ఖలీల్వాడి/ జూన్ 18: ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఐదేళ్లలోపు పిల్లలు, వారి తండ్రులకు టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదేళ్లలోపు చిన్నారులతో కలిసి తండ్రులు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. పల్లెవెలుగు నుంచి ఏసీ బస్సు వరకు ఎందులోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.