నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూన్ 12 : జిల్లావ్యాప్తంగా ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను నిర్వహించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పనులను పర్యవేక్షించారు. నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్రావ్పల్లిలో సర్పంచ్ సాయిలు గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయించారు. బోరుబావులు పూడ్చివేయడం, మురికి కాలువలకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదలను పారిశుద్ధ్య కార్మికులతో తొలగింపజేయించారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ విఠల్, గ్రామపెద్దలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
పిట్లంలోని దళితవాడలో మురికి కాలువల వెంట పెరిగిన పిచ్చిమొక్కలను పంచాయతీ కార్యదర్శి యాదగిరి కార్మికులతో శుభ్రం చేయించారు. కంభాపూర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి తుకారాం మురికి కాలువల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లించి శానిటేషన్ పనులు నిర్వహించారు. కారేగాం గ్రామంలో సర్పంచ్ దుర్గయ్య వివిధ కాలనీలను శుభ్రం చేయించారు. ప్రజలందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు.
గాంధారిలోని ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికులు గ్రామంలోని వీధులను శుభ్రంగా ఊడ్చి, చెత్తను తొలగించారు. మురికి కాలువలోని పూడికను తొలగించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వైకుంఠధామాన్ని సర్పంచ్ మమ్మాయి సంజీవ్‌తో కలిసి ఎంపీడీవో సతీశ్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, ఎంపీడీవో సతీశ్, ఉపసర్పంచ్ రమేశ్, వార్డు సభ్యుడు నితిన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట్ మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇస్సానగర్, ఉప్పర్‌పల్లి, జనగామ, శివారు రాంరెడ్డిపల్లి, యాడారం, తుజాల్పూర్ తదితర గ్రామాల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో పల్లెప్రగతి పనులు చేశారు.
ఇస్సానగర్ గ్రామంలో సర్పంచ్ కవిత, పంచాయతీ కార్యదర్శి మమత, ఉప్పర్‌పల్లి గ్రామంలో సర్పంచ్ ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి వెన్నెల ఆధ్వర్యల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన హరితహారం మొక్కల వద్ద పెరిగిన పిచ్చిమొక్కలను గ్రామస్తులతో కలిసి తొలగించారు. గ్రామ పారిశుద్ధ్య కార్మికులతో మురికి కాలువలు శుభ్రం చేయించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో అవెన్యూ ప్లాంటేషన్‌కు అనువైన ప్రదేశాలను గుర్తించారు. గ్రామంలో పాడుబడిన బావులు, నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చివేశారు. గ్రామంలో మురికి కాలువల వెంట బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పలు, పెంట కుప్పల తొలగింపు తదితర పనులు చేశారు. కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజివాడి, కాళోజివాడి, ఎర్రాపహాడ్, నందివాడ గ్రామాల్లో డ్వాక్రా మహిళలు పల్లెప్రగతిలో పాల్గొని శ్రమదానం చేశారు. రోడ్లను శుభ్రపరిచారు. గ్రామాల్లో ముందుగా గుర్తించిన సమస్యలను పూర్తి చేయడానికి పనులు కొనసాగుతున్నాయి.