నిజామాబాద్ క్రైం, జూన్ 7: మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీ పైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.సార్థసారథి అన్నారు. ఏకాగ్రతతో చదువుతూ పక్కా ప్రణాళికతో సన్నద్ధమైతే తాము అనుకున్న ప్రభుత్వ ఉద్యోగం దక్కుతుందని స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో పోలీస్ ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజుతో కలిసి మంగళవారం ఉద్యోగార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన వేదిక పై నుంచి దిగి వచ్చి అభ్యర్థుల మధ్య నిలబడి తనదైన శైలిలో కీలక సూచనలు చేస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు.
ఉద్యోగ సాధన కోసం పాటించాల్సిన పద్ధతులు, సన్నద్ధ తీరు తదితర అంశాలను క్షుణ్ణంగా వివరించి ఆత్మైస్థెర్యాన్ని కలిగింపజేశారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో తెలుగు మాధ్యమంలోనే తాను చదువుకుని కోరుకున్న సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని సాధించానని తన స్వీయానుభవాన్ని వివరించారు. నిరాశ నిస్పృహలను దరిచేరనివ్వకుండా తాము ఎలాగైనా లక్ష్యాన్ని చేరుకోగలమనే గట్టి సంకల్పంతో కష్టపడితే అనుకున్నది తప్పకుండా సాధించగలమన్నారు. మానసిక ఒత్తిడిని జయిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో యువత కోరుకున్న కొలువులు దక్కించుకుని బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడంతో అనవసర అపోహలకు ఆస్కారం లేకుండా పోయిందన్నారు. జిల్లాకు అత్యధిక కొలువులు దక్కేలా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ అధికారి హోదాను అనుభవిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఆత్మ సంతృప్తిని పొందే అవకాశం కేవలం ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే లభిస్తుందని చెప్పారు. చిన్న చిన్న అవరోధాలు, అపజయాలను చూసి కుంగిపోకూడదని వాటిని విజయానికి మెట్లుగా వాడుకోవాలని సూచించారు. జిల్లాలో ఫ్రీ కోచింగ్ కోసం చేసిన ఏర్పాట్లు, అభ్యర్థులకు అందిస్తున్న శిక్షణ వసతి సౌకర్యాలు ఇతర విషయాల గురించి కలెక్టర్, సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు అరవింద్ బాబు, ఉషా విశ్వనాథ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు శశికళ, నాగోరావ్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు నిజామాబాద్‌కు చేరుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.