బీబీపేట్, జూన్ 6: మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున ఈవోల్ల మల్లయ్య హత్యకు గురైన విషయం విదితమే. మృతుడి కుమార్తె లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ, కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేర కు సీఐ తిరుపతయ్య విచారణ అధికారిగా ఎస్సై సాయికుమార్, సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సో మవారం బీబీపేట బస్టాండ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బీబీపేట్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ తిరుపయ్య, ఎస్సై సాయికుమార్ వివరాలను వెల్లడించారు. మల్లయ్య మంత్రాలు చేస్తూ తన కూతురు సౌందర్యను భయపెట్టి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తండ్రి కొంగరి పోచయ్య, సోదరుడు రాజ్‌కుమార్ ఆరోపిస్తున్నారు.
ఈ విషయమై నిం దితులు మల్లయ్యకు చాలాసార్లు నచ్చ జెప్పినా ఎలాంటి మార్పు రాలేదు. మల్లయ్యను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 4వ తేదీ శనివారం అర్ధరాత్రి నిందితులు నిద్రిస్తుండగా మల్లయ్య వారి ఇంటికి వచ్చి సౌందర్యను తన ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసుకున్నాడు. పోచయ్య ఆవేశంతో ఇదే అదనుగా భావించి కుమారుడు రాజ్‌కుమార్‌తో కలిసి మల్లయ్య ఇంటి తలుపులు పగులగొట్టాడు. ఆవేశంతో ఉన్న వారిద్దరు మల్లయ్యను బయటికి తీసుకొచ్చి బండరాయితో తలపై కొట్టగా తీవ్రంగా గాయపడ్డాడు.
తమ ద్విచక్ర వాహనంలో ఉన్న పెట్రోల్‌ను ఒక ప్లాస్టిక్ డబ్బాలో తీసుకొచ్చి మల్లయ్యపై పోసి నిప్పంటించడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మల్లయ్య చనిపోయినట్లు నిర్ధారించుకొని అక్కడి నుంచి పారిపోయారు. నిందితులు నేరాన్ని ఒప్పుకోవడంతో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి వారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జైలుకు పంపినట్లు సీఐ తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన సీఐ తిరుపతయ్య, ఎస్సై సాయికుమార్, సిబ్బందిని ఉన్నధికారులు అభినందించారు.