నిజామాబాద్, జూన్ 3, (నమస్తే తెలంగాణ ప్రతినిధి):సామాన్యులపై మోదీ సర్కారు ‘ధరల’ కత్తి దూస్తున్నది. ఇప్పటికే అన్ని రేట్ల పెంపుతో జనాన్ని చావబాదుతున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా వంటగ్యాస్‌పై సబ్సిడీకి మంగళం పాడింది. ఎల్పీజీ ధరలను ఇష్టానుసారం పెంచేసిన కేంద్రం.. రాయితీని ఎత్తివేస్తూ, మార్కెట్ రేటుకే కొనాలని స్పష్టం చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లా వాసులపై పెను భారం పడనుంది. రెండు జిల్లాల్లో కలిపి నెలకు సగటున 1.60 లక్షల సిలిండర్ల వినియోగం జరుగుతున్నది. ఒక్కో సిలిండర్‌పై గతంలో రూ.800 లకు పైగా సబ్సిడీ ఉండగా, మెల్లిమెల్లిగా దాన్ని రూ.45.88లకు తగ్గించారు. ఇప్పుడు అది కూడా ఎత్తి వేయడంతో ప్రతి నెలా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వినియోగదారులపై రూ.2.19 కోట్ల మేర అదనంగా భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు. వంట గ్యాస్ కొనడానికి బదులు మళ్లీ కట్టెల పొయ్యిలు వినియోగించడం మేలని చెబుతున్నారు.
అచ్చే దిన్ పేరుతో నిత్యం ప్రగల్బాలు పలికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ చర్యలు జనాలకు చచ్చే దిన్ అన్నట్లుగా మారాయి. దేశంలో అదుపులో లేని ద్రవ్యోల్బణంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. నిత్యం ఇంధన ధరలను పెంచడంతో బండి తీయాలంటే జంకే పరిస్థితి ఎదురవుతోంది. గతంలో దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వంట నూనెలు, వంట సామగ్రి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన ఘనతను దక్కించుకున్న నరేంద్ర మోదీ సర్కారు.. తాజాగా సామాన్యుల నడ్డీ విరిచే మరో నిర్ణయాన్ని తీసుకుంది. వంటగ్యాస్‌పై సబ్సిడీని ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.
సిలిండర్ కొనుగోలు చేయలేని దుస్థితికి చేరిన సామాన్యుల నెత్తిపై తెలియకుండానే భారం మోపే ప్రయత్నం చేస్తున్నారు. తెలివైన నిర్ణయాల పేరిట ప్రజలను నట్టేట ముంచేలా బీజేపీ సర్కారు చర్యలు తీవ్ర ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఎల్పీజీ సిలిండర్‌పై రాయితీని గడిచిన ఎనిమిదేండ్లలో భారీగా తగ్గిస్తూ వస్తోన్న కేంద్ర సర్కారు.. ఇప్పుడు ఏకంగా రాయితీ అన్నదే లేకుండా చేసింది. ఉజ్వల్ పథకంలోని లబ్ధిదారులకు రాయితీ కల్పిస్తున్నట్లు ప్రగల్బాలు పలుకుతున్నప్పటికీ, దీంట్లో అర్హుల సంఖ్య వేళ్లపై లెక్కించేలా ఉన్నారు. మెజార్టీ జనాలకు మాత్రం మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం శరాఘాతంలా మారింది.
సబ్సిడీ మాయం..
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి మార్కెట్లో వంట గ్యాస్ ధర రూ. 1,241గా ఉండేది. అయితే ఇందులో లబ్ధిదారుని వాటా రూ.414 మాత్రమే. మిగిలిన రూ.827 లను కేంద్ర ప్రభుత్వమే రాయితీ రూపంలో ఇచ్చే ది. మోదీ అధికారంలోకి వచ్చే నాటికి ఎల్పీజీ అస లు ధర కన్నా రాయితీ మొత్తమే రెట్టింపు స్థాయి లో ఉండేది. కానీ ఇప్పుడు విడ్డూరంగా మారింది. ఎనిమిదేండ్ల బీజేపీ ఏలుబడిలో ఎల్పీజీ ధరల్లో మతలబు పరిశీలిస్తే మొత్తం అడ్డదిడ్డంగా తిరబడింది. కొద్ది రోజులుగా గ్యాస్ ధరను అమాంతం పెంచింది కేంద్రం.. రాయితీని భారీగా తగ్గిస్తూ వచ్చింది. 2020 మార్చిలో సిలిండర్ ధర రూ.880.50 ఉండగా, వినియోగదారుడికి రాయితీ రూపంలో రూ.348.14 వచ్చేది. ఇదే సంవత్సరం మే నెలలో రాయితీని కేంద్ర ప్రభు త్వం రోజుకింత కోత విధిస్తూ వచ్చింది. ఫలితం గా ఎల్పీజీ సిలిండర్‌పై వచ్చే రాయితీ ఇప్పుడు రూ.45.88కి చేరింది. ఈ కొద్ది మొత్తం రాయితీకి కూడా మోదీ సర్కారు తాజాగా మంగళం పాడిం ది. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండానే ఇంధన శాఖకు చెందిన అధికారులతో చీకటి ఉత్తర్వులు తీసుకువచ్చింది.
మోయలేనంత భారం..
కేంద్ర తాజా నిర్ణయంతో ఉమ్మడి జిల్లా ప్రజలపై ప్రతి నెలా సగటున రూ.2.19 కోట్ల మేర భారం పడనుంది. నిజామాబాద్ జిల్లాలో 26 మంది గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో 3.26 లక్షల మంది వినియోగదారులున్నారు. ప్రతి రోజూ సరాసరి 9 వేల సిలిండర్లు వినియోగం అవుతున్నాయి. ఒక నెలలో దాదాపుగా రెండున్నర లక్షల మేర సిలిండర్లు అవసరమవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో 16 మంది డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో 2.10 లక్షల మంది వినియోగదారులున్నారు. నిత్యం సగటున 6వేల సిలిండర్లు వినియోగిస్తున్నారు. నెలలో దాదాపుగా 1.60 లక్షల సిలిండర్లు వాడకం జరుగుతున్నట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిత్యం 15 వేల సిలిండర్లు వినియోగిస్తుండగా, వాటిపై సబ్సిడీ (రూ.48.55) ఎత్తివేయడంతో రోజుకు రూ.7.28 లక్షల మేర వినియోగదారులపై భారం పడనుంది.
ఎల్పీజీ ధరల వాత..
వంట గ్యాస్ నిత్య జీవితంలో ఒక భాగంగా మారింది. ఒక్క రోజు లేకున్నా పూట గడవడం కష్టమే. పెరిగిన ధరలతో సిలిండర్‌ను వినియోగించేందుకు సామాన్యులు ఆలోచించాల్సిన దుస్థితి ఏర్పడింది. పేద, మధ్య తరగతి వర్గాలైతే సిలిండర్లను మూలకు పడేసేందుకు సిద్ధం అవుతున్నారు. తిరిగి కట్టెల పొయ్యి దిక్కంటూ నిట్టూర్చుతున్నారు. గ్యాస్‌బండ సామాన్యుడికి గుదిబండగా మారుతోంది. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర పెంపుతో వినియోగదారులపై ప్రతి నెలా అదనంగా రూ.కోట్లలో భారం పడుతోంది. ఎల్పీజీ సిలిండర్ ధరలను ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం పెంచడంతో పాటు రాయితీకి మంగళం పాడడంతో ఎనలేని భారం పడుతోంది. 2020 నవంబర్‌లో రూ.670 ఉన్నటువంటి ఎల్పీజీ ధర డిసెంబర్లో రూ.100 పెరిగింది. 2021 ఫిబ్రవరి రూ.75, మార్చిలో మరో రూ.50 పెంచారు. ఏప్రిల్‌లో కంటితుడుపు చర్యగా రూ.10 తగ్గించారు. తిరిగి జూలైలో రూ.25.50, ఆగస్టులో రూ.25, సెప్టెంబర్‌లో రూ.25 పెంచగా, అక్టోబర్‌లో మరింతగా పెంచి సిలిండర్ ధరను రూ.975.50కు చేర్చారు. 2022 ఏప్రిల్‌లో రూ.50, మే నెలలో మరోసారి రూ.50 పెంచడంతో ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1075కు చేరింది.
పేదలకు అన్యాయం చేసినట్టే
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై రాయితీ ఎత్తి వేసి పేదలకు తీవ్ర అన్యా యం చేసింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలపై వివక్ష చూపుతోంది. ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేసి, కష్ట కాలాల్లో ఆదుకునేలా ఉండాలి. కానీ కష్టాల్లో నెట్టేలా ఉండకూడదు.
–కొర్ల ప్రతిమా రెడ్డి, బాన్సువాడ