పల్లె.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ధి బాటలో వేగంగా పయనిస్తున్నది. సమైక్య పాలనలో గ్రామాలను పట్టించుకున్న వారే లేరు. పల్లెల అభివృద్ధి గురించి ఆలోచనే చేయలేదు. తెలంగాణ వచ్చినంకనే ఊర్లు బాగు పడ్డాయి. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన మాట ప్రకారం పంచాయతీలకు పుష్కలంగా నిధులు ఇస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తున్నారు. ఆ డబ్బులు నేరుగా గ్రామపంచాయతీల అకౌంట్లలో జమ అవుతున్నాయి. 2019 నుంచి ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాకు రూ.339.88కోట్లు, కామారెడ్డి జిల్లాకు రూ.240 కోట్ల వరకు విడుదలయ్యాయి. దండిగా నిధులు వస్తుండడంతో పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయి. స్వయం పాలనలో సంక్షేమ ఫలాలు మారుమూలకూ చేరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రజల భాగస్వామ్యం పెరిగి ఊర్లన్నీ బాగు పడుతున్నాయి.
నిజామాబాద్, మే 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :సమైక్యాంధ్ర పాలకుల హయాంలో నిధులు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి ఎక్కడికక్కడే కుంటుపడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో ప్రజల భాగస్వామ్యం పెరిగి ఊర్లన్నీ బాగు పడుతున్నాయి. పారిశుద్ధ్య పనులు, మొక్కల పెంపకం, విద్యుత్ సమస్యల పరిష్కారం తదితర పనులు విజయవంతంగా నిర్వహించి ఎక్కడికక్కడే ఇబ్బందులను తొలగిస్తున్నారు. ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరడంతోపాటు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత నెలకొనేలా ఉండేందుకు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధులతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు సమాన వాటాగా పంచాయతీలకు చేరుతున్నాయి. పరిసరాల శుభ్రత, హరితహారం నిర్వహణ, మొక్కల సంరక్షణకు అవసరమైన ట్రీగార్డులు కొనుగోలు చేయడం, పారిశుద్ధ్యం మెరుగుకు మురుగు కాల్వల నిర్మాణం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రహదారుల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల చెల్లింపు, చేతి పంపుల మరమ్మతు, నీటి ట్యాంకుల శుద్ధీకరణ తదితర పనులకు ఎలాంటి ఢోకా లేకుండా పల్లెల్లో ప్రగతి పనులు కొనసాగేలా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఉపయుక్తం అవుతున్నాయి.
ఇచ్చిన మాట ప్రకారం..
తెలంగాణ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ భావించారు. ఇందులో భాగంగా 2018లో అసెంబ్లీలో గ్రామీణాభివృద్ధిపై జరిగిన చర్చలో మాట్లాడుతూ గ్రామాలకు నిధులు అందిస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే 2019 సెప్టెంబర్ నెల నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో కేంద్ర ఫైనాన్స్ నిధులతోపాటు స్టేట్ ఫైనాన్స్ నిధులను జతచేసి విడుదల చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సంఘం నిధులు విడుదల అవుతుండడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో కరెంట్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడిన గ్రామ పంచాయతీలు నేడు బకాయిలు లేకుండా గెలిచి నిలిచాయి. అంతేకాకుండా గ్రామాల్లో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనులు చేపడుతున్నారు. జనాభా ప్రాతిపదికన సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కోట్లాది రూపాయలు పల్లెలకు చేరుతున్నాయి. నిధులు లేక నీరుగారిన పల్లెలకు ఆర్థిక సాంత్వన చేకూరుస్తూ ప్రగతి పల్లెలుగా రూపుదిద్దేలా సర్కారు పాటుపడుతున్నది. నిజామాబాద్ జిల్లాకు 2019 నుంచి నేటి వరకు రూ.339.88కోట్లు, కామారెడ్డి జిల్లాకు సుమారుగా రూ.240 కోట్లు వరకు విడుదలైనట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాకు మొత్తం రూ.579 కోట్లు మేర ఫైనాన్స్ కమిషన్ నిధులు మంజూరు కావడం విశేషం.
ట్రెజరీ ద్వారా నిధుల జమ..
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఆర్థిక సంఘం ఇచ్చే పలు గ్రాంట్లతో గ్రామాలను ఏటా ఆదుకుంటాయి. ప్రస్తుతం నిధుల విడుదలతో గ్రామ పంచాయతీలు కొత్త కళను సంతరించుకున్నాయి. మొన్నటి వరకూ పైసల్లేక సతమతమైన సర్పంచులు, అధికారులకు ఇక ప్రజల కనీస అవసరాలను తీర్చే పనిలో నిమగ్నం అవుతున్నారు. నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు సీఎఫ్సీ, ఎస్ఎఫ్సీ నిధులతో భారీ ఊరట లభించింది. ఈ నిధులు జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి ఆయా గ్రామ పంచాయతీ బ్యాంకు అకౌంట్లకు బదలాయింపు జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాలో 29 మండలాల్లో 530 గ్రామ పంచాయతీలున్నాయి. ఆర్మూర్, బోధన్, భీమ్గల్ పురపాలక సంఘంతోపాటు నిజామాబాద్ నగరపాలక సంస్థలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో మొత్తం 526 గ్రామ పంచాయతీలున్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీలు ఉన్నాయి.
మౌలిక సదుపాయాలకు వినియోగం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంఘం నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగిస్తున్నాం. గ్రామ పంచాయతీ పాలకవర్గాల ఆధ్వర్యంలో ఆమోదం పొందిన పనులకు ఈ నిధులను వెచ్చించి ప్రజలకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తున్నాం. ఆర్థిక సంఘం నిధులతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక లోటు లేకుండా బలోపేతం అవుతున్నాయి.
– జయసుధ, జిల్లా పంచాయతీ అధికారిణి, నిజామాబాద్