బిచ్కుంద, మే 14 : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేశామని సొసైటీ కార్యదర్శి సాయిప్రకాశ్ శనివారం తెలిపారు. మండలంలోని పుల్కల్ సొసైటీ పరిధిలో దడ్గి, గుండెనెమ్లి, పుల్కల్, బండారెంజల్ గ్రామాల పరిధిలో సాగుచేసిన 28 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటా పెట్టి రైస్‌మిల్‌కు తరలించినట్లు తెలిపారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో రైతులు పండించిన ధాన్యానికి నష్టం వాటిళ్లకుండా ముందుజాగ్రత్తగా అదనపు కాంటాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హమాలీల ద్వారా లారీల్లోకి ధాన్యం ఎక్కించి రైస్‌మిల్‌కు తరలిస్తున్నామని ఆయన అన్నారు. రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టాలన్నారు. పొల్లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి కాంటాలు వేయించాలని తెలిపారు. ధాన్యం కాంటా చేసుకున్న రైతులు ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా బుక్కులు ఇవ్వాలన్నారు. బిచ్కుంద సొసైటీ పరిధిలో 25 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్‌కు తరలించామని సొసైటీ కార్యదర్శి శ్రావణ్ తెలిపారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
మండలంలోని గున్కుల్ సొసైటీ ఆధ్వర్యంలో తున్కిపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ వాజిద్‌అలీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు లింగాల రాంచందర్, పుప్పల విఠల్, మాజీ చైర్మన్ మోహిజ్, జాగృతి మండల కన్వీనర్ ఆమేర్, సాయిలు, శ్రీను, అరవింద్, రవి, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.