బోధన్/ఆర్మూర్, మే 9: బోధన్ పట్టణంలోని ఉద్మీర్‌గల్లీకి చెందిన సిద్ధ ప్రవీణ్-సుధ దంపతుల 20నెలల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించి చిన్నారి వైద్యం కోసం రూ. 2 లక్షల ఎల్వోసీని మంజూరు చేయించారు. సంబంధిత కాపీని సోమవారం అందజేయగా, బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే షకీల్, టీఆర్ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కిడ్నీ బాధితుడికి ఆర్థికసాయం
ఆర్మూర్ పట్టణానికి చెందిన రూపాజీ చంద్రప్రకాశ్ కుమారుడు రవీందర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, టీఆర్ఎస్ నాయకులు పండిత్ పవన్, పండిత్ ప్రేమ్ సోమవారం పరామర్శించారు. వైద్య ఖర్చుల కోసం రూ.10వేలు అందజేశారు. అనంతరం ఈ విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. బాధితుడికి నిమ్స్ దవాఖానలో అయ్యే వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్వోసీ ఇప్పిస్తానని హామీ ఇచ్చారని పండిత్ ప్రేమ్ చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఎస్కే సమాజ్ ఆర్మూర్ అధ్యక్షుడు పడాల్ గణేశ్, కార్యదర్శి బారడ్ గంగామోహన్, ఉపాధ్యక్షుడు కర్తన్ దినేశ్, కౌన్సిలర్ బారడ్ రమేశ్, ప్రతినిధులు మహేశ్, సుఖేశ్శర్మ, కిశోర్ పాల్గొన్నారు.