కామారెడ్డిరూరల్ మే 9 : సులువుగా డబ్బులు సంపాదించి ఇంటిని నిర్మించుకోవాలని దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
గత నెల 29వ తేదీన గాంధారి మండలంలోని పేట్ సంగెం గ్రామ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న ఓ వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్‌పై ఎక్కించుకుని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు. అనంతరం వృద్ధురాలిపై కట్టెలు, రాళ్లతో దాడి చేసి బంగారు పుస్తె, చేతి కడియాలు దోచుకుపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 30వ తేదీన కేసు నమోదు అయ్యింది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎల్లారెడ్డి పోలీసులకు పద్మాజి ఎక్స్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా నంబర్‌ప్లేట్ లేని వాహనంపై వెళ్తున్న బోనాల గ్రామానికి చెందిన బానోత్ రాజ్‌కుమార్‌ను సోమవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. రాజ్‌కుమార్‌కు పాత రేకుల ఇల్లు ఉందని, కొత్త ఇల్లు నిర్మించుకునేందుకు సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో దొంగతనం వృత్తిగా ఎంచుకున్నాడన్నారు.
ఏడాది క్రితం లింగంపేట్ మండలంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద ఓ మహిళపై దాడి చేసి ఆమె వద్ద నుంచి బంగారు చెవి కమ్మలు లాక్కుని ఓ ప్రైవేట్ ఫైనాన్స్‌లో అమ్ముకున్నాడు. ఈ రెండు కేసుల్లో నిందితుడు అయిన బానోత్ రాజ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎల్లారెడ్డి డీఎస్పీ, సీఐ, సదాశివనగర్ ఎస్సైలను అభినందించారు. సీసీ కెమెరాలను చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని, ఇంకా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.