కామారెడ్డి, మే 9: కామారెడ్డి జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనవరి 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 96 రోడ్డు ప్రమాదాలు సంభవించగా 115 మంది మృతిచెందారు. మరో 250మంది క్షతగాత్రులయ్యారు. భిక్కనూర్ నుంచి దగ్గి వరకు గల 44వ నంబర్ జాతీయ రహదారి, కరీంనగర్- కామారెడ్డి-ఎల్లారెడ్డి-పిట్లం రాష్ట్ర రహదారి, సంగారెడ్డి-నాందెడ్ 161 జాతీయ రహదారితోపాటు ఎల్లారెడ్డి-బాన్సువాడ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 44వ జాతీయ రహదారిపై సదాశివనగర్ వద్ద లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మార్చి 28న మాచారెడ్డి మండలం ఘన్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మరణించారు. తాజాగా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం లారీ-టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు.
స్పీడ్ గన్స్ పెట్టినా.. తగ్గని ప్రమాదాలు
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా యి. ప్రధానంగా కామారెడ్డి జిల్లా పరిధిలోని జాతీ య రహదారులపై ద్విచక్ర వాహనాలతోపాటు కార్లు, ఆటోలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రమాదాల నియంత్ర ణ కోసం జాతీయ రహదారులపై పోలీ సు శాఖ ఆధ్వర్యంలో స్పీడ్ గన్స్ ఏర్పా టు చేశారు. 80కి.మీ కన్నా వేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి జరిమానాలతో అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టారు. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్స్‌గా గుర్తించారు. సదాశివనగర్ మండలం పరిధిలోని దగ్గి, పద్మాజివాడి ఎక్స్‌రోడ్, మల్లుపేట, కామారెడ్డి మండలం టేక్రియాల్ చౌరస్తా, మాచారెడ్డి మండలం ఘన్పూర్ రోడ్లను ప్రమాద ప్రాంతాలుగా గుర్తించారు.