ఇందూరు, మే 6 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షను నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 17,932 మంది విద్యార్థులకు 17,139 మంది విద్యార్థులు (95.6 శాతం) హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి లోకం రఘురాజ్ వెల్లడించారు. 793 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఇందులో 15,740 మంది జనరల్ విద్యార్థులకు గాను 15,156 మంది విద్యార్థులు, వొకేషనల్‌లో 2,192 మంది విద్యార్థులకు గాను 1,983 మంది విద్యార్థులు హాజరైనట్లు వివరించారు.
బోధన్‌లోని విజయసాయి జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి కాపీ చేస్తుండగా మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గోల్డెన్‌జూబ్లీ, ఎస్సెస్సార్, ఎస్ఆర్, ఉమెన్స్ కళాశాల కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి, చిన్నయ్య, కనకమహాలక్ష్మి 5 పరీక్షా కేంద్రాలు, హైపవర్ కమిటీ సభ్యుడు రవికుమార్ 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు 20 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా..
కామారెడ్డి జిల్లావ్యాప్తంగా మొత్తం 41 సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9870 విద్యార్థులకు గాను 9270 మంది (93.92 శాతం) హాజరైనట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం వెల్లడించారు. ఇందులో జనరల్ విద్యార్థులు 8,882 మందికి గాను 8,406 మంది హాజరయ్యారు. 476 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్‌లో 988 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 864 మంది హాజరయ్యారు. 124 మంది గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలను ఇంటర్ నోడల్ అధికారి తనిఖీ చేశారు.
నిమిషం ఆలస్యంగా వచ్చిన నలుగురు విద్యార్థులకు నో ఎంట్రీ..
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పరీక్షకు నలుగురు విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు. చీఫ్ సూపరిండెంటెంట్ ప్రభాకర్ ‘నిమిషం’ నిబంధనల ప్రకారం వారిని పరీక్షలకు అనుమతించలేదు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగా చేరుకోవాలని సూచించారు.