నిజాంసాగర్, ఏప్రిల్ 30 : రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఉమ్మడి జిల్లాలో చురుగ్గా కొనసాగుతున్నది. పథకానికి అర్హులను గుర్తించి ఇప్పటికే రెండుసార్లు యూనిట్లను పంపిణీ చేసింది. దీంతో యూనిట్లు పొందిన లబ్ధిదారులు వివిధ వ్యాపారాలు నిర్వహిస్తూ సంతోషంగా ఉన్నారు. దళితబంధు పథకానికి పైలట్ మండలంగా ఎంపిక చేసిన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో 1,329 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో 827 మంది లబ్ధిదారులకు నేడు యూనిట్లను పంపిణీ చేయనున్నారు. దీంతో దళిత కుటుంబాలు సంబురాలు జరుపుకొంటున్నాయి. ట్రాక్టర్లు, జేసీబీలు, వరి కోత యంత్రాలు, గొర్రెలు, మేకలు, కిరాణ దుకాణాలు ఇలా ఎవరికి నచ్చిన రంగాన్ని వారు ఎన్నుకున్నారు. లబ్ధిదారులకు ట్రాక్టర్లు, వరి కోత యంత్రాలు, పొక్లెయినర్లు, ఆటోలు, జీపులు, కార్లు, నాలుగు చక్రాల వాహనాలతోపాటు గొర్రెలు, బర్రెలు, కోళ్లు, సెంట్రింగ్, టెంటు తదితర యూనిట్లను ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అందించనున్నారు. ఈ నేపథ్యంలో వాహనాలను ఇప్పటికే మండల కేంద్రంలో సిద్ధంగా ఉంచారు. యూనిట్ల పంపిణీ నేపథ్యంలో ఏర్పాట్లను శనివారం ప్రజా ప్రతినిధులు, అధికారులు పరిశీలించారు.
డ్రైవర్ కాదు ఓనరే
నా ఒక్కగానొక్క ఆటో నడుపుకొంటూ పట్నంలో బతుకుతున్నాడు. ఉపాధి లేక చేతిలో పైసలు లేక పట్నంలో పనిచేస్తుంటే వాడి కోసం ఆలోచించే వారిమి. దళిత బంధుతో ఆ రోజులు మారనున్నాయి. సీఎం కేసీఆర్ సారు, ఎమ్మెల్యే హన్మంత్‌షిండే దయతో మా ఇంటికి ఆటో రాబోతుంది. ఇక నా కుమారుడు డ్రైవర్ కాదు ఓనర్ కాబోతున్నాడు. ఇక మాకు ఎలాంటి బెంగ లేదు. సారు సల్లగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నం.
-మంగ శాంతవ్వ, గోర్గల్
సీఎం సారు వల్లే ట్రాక్టర్ వస్తున్నది..
దళితబంధు పథకం కింద ట్రాక్టర్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. మాకు ఇచ్చే ట్రాక్టర్ ఇదే. మాకు గ్రామంలో రెండెకరాల పొలం ఉంది. దీంతో పాటు నా కుమారుడు ఇతరుల ట్రాక్టర్‌పై డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సీఎం కేసీఆర్ సార్ పుణ్యమా అంటూ ఇక నా కొడుకు డ్రైవర్ నుంచి ఓనర్‌గా మారబోతున్నందుకు సంతోషంగా ఉంది. అసలు కలలో కూడా మా ఇంటికి ట్రాక్టర్ వస్తదని అనుకోలేదు. అలాంటిది సీఎం కేసీఆర్ సారు దయతో ట్రాక్టర్‌కే ఓనరు కాబోతున్నాడు.
-జుంజురు మొగులవ్వ, గోర్గల్