నిజామాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పన్నుల వసూళ్లు తప్పనిసరి. పన్నులు సకాలంలో వసూలైతేనే పల్లె ప్రగతి సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న ఆర్థిక సంఘం నిధులతో పాటు ఇంటి పన్నులు కూడా కీలకమే. ఈ నేపథ్యంలో పంచాయతీ అధికారులు 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. కరోనా కారణంగా అడ్డంకులు ఎదురైనా ప్రజలు పన్నులు చెల్లించేలా అవగాహన కల్పించారు. పకడ్బందీ చర్యలతో ఇంటింటికీ తిరుగుతూ పన్ను బకాయిలను వసూలు చేయడం ద్వారా రాష్ట్రంలోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నాయి. కామారెడ్డి జిల్లా ఏకంగా పన్ను వసూళ్లలో రికార్డును సాధించింది. లక్ష్యానికి మించి పన్ను వసూ లు చేయడం ద్వారా రాష్ట్రంలోనే మొదటి స్థానం లో నిలిచింది. నూరు శాతం లక్ష్యానికి నిజామాబా ద్ జిల్లా కాసింత దూరంలో నిలిచి 8వ స్థానంతో సరిపెట్టుకున్నది. ఉభయ జిల్లాల్లో పన్ను వసూళ్ల పనితీరు అద్భుతంగా ఉండడంతో జిల్లా యం త్రాంగానికి రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు విజయవంతం అయ్యాయి.
టాప్‌లో ఉభయ జిల్లాలు…
గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లలో ఉత్తమ పనితీరు కనబర్చిన మొదటి పది జిల్లాల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలున్నాయి. కామారెడ్డి ఏకంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. నిజామాబాద్ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 530 గ్రామ పంచాయతీలున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల లక్ష్యం రూ.27.90 కోట్లుగా ఉంది. మార్చి 31వ తారీఖు నాటికి జిల్లా వ్యాప్తంగా రూ.27.80 కోట్లు పన్ను వసూళ్లు పూర్తి చేశారు. కేవలం రూ.9.26 లక్షలు మాత్రమే పన్ను బకాయిలు నిజామాబాద్ జిల్లాలో మిగిలి పోయాయి. వంద శాతం లక్ష్యానికి 99.67శాతం మేర పన్ను వసూళ్లతో స్టేట్‌లో నిజామాబాద్ జిల్లా 8వ స్థానంలో నిలిచింది. ఇక కామారెడ్డి జిల్లా పన్ను వసూళ్లలో సత్తా చాటింది. ఈ జిల్లాలో 526 గ్రామ పంచాయతీలున్నాయి. పన్ను వసూళ్ల లక్ష్యం రూ. 9.99 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ఏకంగా రూ.10కోట్లు పన్నులు వసూలయ్యాయి. 100శాతం లక్ష్యానికి గాను ఏకంగా 100.06 శాతం పన్నులు రికార్డు స్థాయిలో వసూ లు కావడంతో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. నారాయణపేట, సిద్ధిపేట, వనపర్తి జిల్లాలు వంద శాతం పన్ను వసూళ్లు చేరుకున్నప్పటికీ కామారెడ్డి జిల్లాను మాత్రం అందుకోలేకపోయాయి.
పల్లెలు పచ్చగా…
పంచాయతీలకు ప్రధాన ఆదాయ వనరు పన్నులు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం సీరియస్‌గా దృష్టి పెట్టింది. పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులకు పంచాయతీ రాజ్ చట్టం-2018 ప్రకారం చర్యలు తీసుకునే వీలుండడంతో వారంతా పన్నుల వసూళ్లకు పాటుపడేలా జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. గ్రామ పంచాయతీ పన్నుల వసూళ్లలో 2021, డిసెంబర్ నాటికి అంతంత మాత్రంగానే ఉండగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే వేగంగా వసూళ్లు జరిగాయి. ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలోనే అత్యధికంగా పన్నులు రాబట్టారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలతో సమావేశమై గ్రామాభివృద్ధి కోసం పన్నులను వసూలు చేశారు. గ్రామా ల్లో వంద శాతం పన్నులు వసూలైతే ఆ డబ్బులు పూర్తిగా సద్వినియోగమైతే పల్లెలు పచ్చగా ఉంటా యి. ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు సమకూరుతాయి. మురుగు కాల్వలు, వీధి దీపాలు, నీటి పథకాల నిర్వహణ, మరమ్మతులు, రహదారుల నిర్మాణం తదితర పనులన్నీ చకచకా చేసుకోవచ్చు. అందుకే పంచాయతీల్లో ఇంటి పన్నులు, ఆస్తి, ఇతరత్రా పన్నుల వసూలుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లా అధికారులు ముందు నుంచి ముమ్మర కసరత్తు చేశారు. ప్రజలకు పూర్తి స్థాయిలో పన్ను వసూళ్లపై అవగాహన పెంపొందించి స్వచ్ఛందంగా పన్ను చెల్లింపులు జరిగేలా ప్రయత్నం చేశారు.
పకడ్బందీ వ్యవస్థ…
గతంలో పంచాయతీలకు పాలకవర్గాలున్నప్పటికీ పరిపాలన సిబ్బంది లేకపోయేది. తెలంగాణ రాక మునుపు వరకు పల్లెల్లో అస్తవ్యస్థమైన పరిస్థితులు దాపురించాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న పరిపాలనా సంస్కరణలతో తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా రూపాంతరం చెందాయి. చిన్నపాటి గ్రామాలకు పంచాయతీ హోదా కట్టబెట్టారు. అలాగే పెద్ద ఎత్తున జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టి ప్రతి గ్రామ పంచాయతీకి సెక్రటరీని కేటాయించారు. పాలక వర్గాలు కొలువుదీరిన తర్వాత పంచాయతీ సెక్రటరీలు ఎక్కడికక్కడ తోడవ్వడంతో పరిపాలన పట్టాలెక్కినట్లు అయ్యింది. పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో గ్రామ పరిపాలన భేషుగ్గా జరుగుతుండగా పన్ను వసూళ్ల వంటి ప్రత్యేక కార్యక్రమాల్లోనూ మెరుగైన ఫలితాలు రాబట్టడంలో కింది స్థాయి సిబ్బంది పనితీరు గొప్పగా ఉంటున్నది. తెలంగాణ సర్కారు హయాంలోనే మండల స్థాయిలో పర్యవేక్షణకు మండల పంచాయతీ అధికారులను సైతం నియమించారు. డీఎల్పీవోలను భర్తీ చేయడంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పంచాయతీ శాఖలో సిబ్బంది కొరత అంటూ మచ్చుకూ కనిపించడం లేదు.
సమష్టి కృషితోనే సాధ్యమైంది…
నిజామాబాద్ జిల్లాలో శత శాతం పన్ను వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పని చేశాం. స్వల్పంగా బకాయిలు మిగలడంతో 99.67శాతం మేర పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరుకున్నాం. టాప్ టెన్‌లో నిజామాబాద్ జిల్లా నిలవడం వెనుక సమష్టి కృషి దాగి ఉంది. పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, డీఎల్పీవోలు అందరూ ఎవరి స్థాయిలో వారు శ్రమించడంతోనే ఇది సాధ్యమైంది. ఇదే స్ఫూర్తితో 2022-23లోనూ పన్ను వసూళ్లలో మంచి ఫలితాలు సాధిస్తాం.
– జయసుధ, నిజామాబాద్ జిల్లా పంచాయతీ అధికారి