మోర్తాడ్, ఏప్రిల్ 18 : వ్యభిచార దందా నడుపుతున్న మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు పోలీసులకు చిక్కాడు. మోర్తాడ్‌లో గౌరవప్రదంగా జీవించే నివాసాల మధ్య సెక్స్ ముఠాను నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించడంతో మోర్తాడ్‌కు చెందిన చౌల్ శ్రీనివాస్ వ్యభిచార దందా గుట్టు రట్టయ్యింది. ఆర్మూర్ ఏసీపీ రఘు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో పట్టుబడిన శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వ్యభిచార దందాపై పోలీసుల దాడిలో బీజేపీ నాయకుడు అడ్డంగా దొరికిపోవడంపై ప్రజలు ఇదా బీజేపీ నేత అసలు స్వరూపం అంటూ చర్చించుకుంటున్నారు. మోర్తాడ్ ఎస్సై ముత్యం రాజు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలోని గోవింద్ రెడ్డి కాలనీలో వ్యభిచారం జరుగుతున్నదన్న సమాచారం రావడంతో ఆర్మూర్ ఏసీపీ రఘు, భీమ్‌గల్ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మోర్తాడ్ ఎస్సై ముత్యం రాజు, టాస్క్ ఫోర్స్ సిబ్బందితో కలిసి ఆదివారం మధ్యాహ్నం గోవింద్ రెడ్డి కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న ఓ ఇంట్లో దాడి నిర్వహించారు. ఆ ఇంట్లో ఇంటి యజమాని మోర్తాడ్‌కు చెందిన పిట్టెల వినోద (ఆర్గనైజర్ అండ్ వర్కర్), మోర్తాడ్‌కు చెందిన చౌల్ శ్రీనివాస్(నిర్వాహకుడు), కస్టమర్లుగా వచ్చిన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుట్లకు చెందిన మర్రిపల్లి రాజ్‌కుమార్, మెట్‌పల్లిలోని ఆదర్శనగర్‌కు చెందిన పరిపెల్లి గంగాధర్‌ను అరెస్టు చేశారు. వినోద నుంచి ఒక మొబైల్, రూ.2 వేలు, శ్రీనివాస్ నుంచి ఒక మొబైల్, రూ.1000, రాజ్ కుమార్, గంగాధర్ నుంచి మొబైల్ ఫోన్లు స్వాధీనపర్చుకున్నారు. వీరిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. పిట్టెల వినోద ఇంట్లో వ్యవభిచారం నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో వినోద, శ్రీనివాస్ జీవనం సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇదేనా బీజేపీ నాయకుల తీరు : ఎంపీపీ
బీజేపీ నాయకులు చెప్పే నీతులకు.. చేసే పనులకు అసలు పొంతనే లేదని ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్ ఎంపీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోర్తాడ్‌లో బీజేపీ నాయకుడు వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డాడని, ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నందుకు ఆ పార్టీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు. ఇంట్ల పంచాయతీ పెట్టుకుని, అభివృద్ధి గురించి మాట్లాడడం మానుకోవాలన్నారు. వ్యభిచారం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు నడుపుతున్నది బీజేపీ నాయకులన్నది తేటతెల్లమయిందని అన్నారు. ఇటీవల కమ్మర్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఒక మహిళ విషయంలో అసభ్యకరంగా వ్యవహరించిన విషయం తెలిసిందేనని, ఇటువంటి నాయకులు పార్టీలో ఉంచుకున్నారంటే ఆ పార్టీ ఎటువంటి వారికి మద్దతు ఇస్తుందో తెలుస్తుందన్నారు. బీజేపీకి చెందిన వారు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. పార్టీ పెద్దలు నాయకులు, కార్యకర్తలు మంచి పనులు చేసేలా చూసుకోవాలని, ఇప్పటికైనా ఇతరుల గురించి అవాకులు చవాకులు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఎంపీటీసీ రాజ్‌పాల్, సాయిరాం, సదన్ తదితరులు పాల్గొన్నారు.