ఆర్మూర్, ఏప్రిల్ 18: విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మనఊరు – మనబడి కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ మండలంలోని ఇస్సాపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.30లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన పనులకు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు- మనబడి కార్యక్రమం ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు వస్తాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బడ్జెట్లో రూ.7678 కోట్ల నిధులను కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
నాణ్యమైన విద్యనందించడమే గాక ఆంగ్ల భాషలో బోధించి అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే కేసీఆర్ లక్ష్యమన్నారు. అనంతరం పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో 26 కులాల మహా సర్వసమాజ్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘ నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ దార్ల దీవెనారాజు, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, ఎంపీటీసీ ఉమ్మెడ లినీతామహేశ్, మాజీ సర్పంచులు తంబూరి శ్రీనివాస్, నరేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆలూర్ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పి.నరేందర్, ఎంఈవో పింజ రాజగంగారాం, ఆర్మూర్ మహా సర్వసమాజ్ అధ్యక్షుడు సుంకరి రవి, సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.