బోధన్, ఏప్రిల్ 18: ‘మన ఊరు -మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమంతో పట్టణ ప్రాంతాల్లోని సర్కార్ స్కూ ళ్లకు మహర్దశ పట్టబోతున్నదని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. బోధన్ పట్టణంలోని తట్టికోట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘మన బస్తీ – మన బడి’ పనులను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో ‘మన ఊరు – మన బడి’, ‘మన బస్తీ – మన బడి’ కార్యక్రమాలను అమలుచేస్తున్నారన్నారు. తట్టికోట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.34లక్షలతో కాంపౌండ్ వాల్, ఇతర మరమ్మతులు, ఆర్వో ప్లాంట్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. పట్టణంలోని 15 పాఠశాలలకు ‘మన బస్తీ – మన బడి’ కింద ఐదున్నర కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, ఎంఈవో శాంతకుమారి, డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, స్థానిక కౌన్సిలర్ పిట్ల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ రుద్ర సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రామలింగం, మున్సిపల్ డీఈ లింగంపల్లి శివానందం, బోధన్ శివాలయం మాజీ చైర్మన్ బీర్కూర్ బుజ్జి, టీఆర్ఎస్ నాయకులు గోగినేని నర్సయ్య, చందు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత పాల్గొన్నారు.