నిజామాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమైక్యపాలనలో గొల్ల, కుర్మలకు సొసైటీలు స్థాపించుకోవాలంటేనే అదో పెద్ద తంతుగా ఉండేది. పశు వైద్య శాఖలో ఆయా విభాగాల్లో లంచాలు ఇచ్చుకున్నప్పటికీ సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు లేకపోయేది. సహకార శాఖ ఆధ్వర్యంలో సొసైటీల ఏర్పాటు ఉండడంతో సొసైటీల జోలికి వెళ్లాలంటే అంతా భయపడేది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గొల్ల, కుర్మల సొసైటీల ఏర్పాటుకు నిబంధనలను సరళీకరించారు. చట్ట సవరణ చేసి పశు, సంవర్ధక శాఖ ఆధ్వర్యంలోనే సొసైటీల ఏర్పాటుకు మార్గం సుగమం చేశారు. దీంతో పారదర్శకంగా ఎలాంటి పైసా ఖర్చు లేకుండా కనిష్ఠ సభ్యత్వ రుసుముతో సొసైటీలు జిల్లాలో పురుడు పోసుకున్నాయి. 18 ఏండ్లు నిండిన వారంతా ఇందులో సభ్యత్వం తీసుకున్నారు. సొసైటీలు బలోపేతం చేయడంతోపాటు గొల్ల, కుర్మలకు భారీ రాయితీతో ప్రభుత్వమే జీవాలను అందిస్తోంది. కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలుస్తూ వారికి జీవనాధారంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో 329 సొసైటీల్లో 20,971 మంది సభ్యులున్నారు. మొదటి విడుతలో భారీగా జీవాల పంపిణీ జరిగింది. రెండో విడుతలో 1072 మంది డీడీలు చెల్లించగా, వీరందరికీ యూనిట్ల పంపిణీ ప్రక్రియను యంత్రాంగం చేపట్టింది. 563 మందికి గ్రౌండింగ్ పూర్తి కాగా… మిగిలిన వారికి యూనిట్లు త్వరలోనే పంపిణీ చేయనున్నారు.
ఒక్క యూనిట్ ధర రూ.1.75లక్షలు
గొల్ల, కుర్మలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయితీ గొర్రెల పథకానికి నిబంధనల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. బహిరంగా మార్కెట్లో జీవాల ధరలు పెరుగడంతో అందుకనుగుణంగా యూనిట్ ధరను ప్రభుత్వం పెంచింది. ఏకంగా రూ.50వేలు అదనంగా యూనిట్ ధరను పెంచింది. దీంతో గొర్రెల కాపరుల వాటాల్లో కాసింత పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే డీడీలు చెల్లించి గొర్రెల యూనిట్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు కొత్త నిబంధనల వివరాలను అధికారులు వివరించి యూనిట్లు అందిస్తున్నారు. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేసేందుకు గతంలో లబ్ధిదారుల నుంచి రూ.31,250 డీడీ రూపంలో తీసుకున్నారు. మారిన నిబంధనల ప్రకారం మరో రూ.12,500 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. యూనిట్ రాయితీని పెంచినందుకు లబ్ధిదారుల వాటాను పెంచినట్లుగా ప్రభుత్వం ఇప్పటికే వివరించింది. మార్పులు, చేర్పులకు గురైన పథకం విధివిధానాలకు అనుగుణంగా డీడీలు చెల్లించిన వారంతా కొత్త నిబంధనలకు అనుగుణంగా చెల్లింపులు చేస్తున్నారు. పాత విధానంలో యూనిట్ విలువ రూ.లక్షా 25 వేలు ఉంది. ఇందులో లబ్ధిదారుల వాటా రూ.31,250 గా నిర్ణయించారు. కొత్త విధానంలో యూనిట్ విలువ రూ.లక్షా 75 వేలు కావడంతో లబ్ధిదారుడి వాటా రూ.43,750కి చేరింది.
విజయవంతంగా పంపిణీ
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రెండో విడుత లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఏ -జాబితాలో 9631 మంది లబ్ధిదారులు ఎంపికవగా, ఇందులో 8522 మంది డీడీలు కట్టారు. వీరందరికీ ఇదివరకే గొర్రెల యూనిట్లు అందించారు. బీ -జాబితాలో 5123 డీడీలు రాగా 1103 మందికి యూనిట్లు అందించారు. కొందరు డీడీలు వాపసు తీసుకోగా 1072 డీడీలున్నాయి. వీరందరికీ ఈ దఫా జాబితాలో యూనిట్లు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నిజామాబాద్లో ఇప్పటికే 563 మందికి యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేశారు. కొత్తగా పెరిగిన యూనిట్ ధర ప్రకారం పెరిగిన లబ్ధిదారుడి వాటా చెల్లింపులను పూర్తి చేసిన వారందరికీ యూనిట్లను చకచకా అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మొదటి విడుతలో ఏ- జాబితాలో 8349 యూనిట్లు, బీ -జాబితాలో 1744 మందికి యూనిట్లు అందించారు. రెండో విడుతలో దాదాపుగా 705 మంది డీడీలు కట్టగా, వీరందరికీ యూనిట్లు మంజూరు కానున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి యూనిట్లు కొనుగోలు చేసి తెచ్చుకునేలా ఆప్షన్ ఇచ్చారు.
సాంకేతికత వినియోగం
గొల్ల, కుర్మ కుటుంబాల అభివృద్ధి కోసం తీసుకువచ్చిన ఈ పథకంలోనూ కొంత మంది కక్కుర్తి పడి వక్రబాట పట్టారు. అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో రెండో విడుతలో గొర్రెల పంపిణీని మరింత పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించారు. కొంత మందికి నాసిరకం గొర్రెలను కొనుగోలు చేసి ఇచ్చారని, మరికొంత మందికి గతంలో కొనుగోలు చేసిన వాటినే రీసైక్లింగ్ చేశారనే ఆరోపణలున్నాయి. కొంత మంది దళారులు ఆంధ్రప్రదేశ్తో పాటు మనరాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో గొర్రెలను కొనుగోలు చేసి, వాటిని మహారాష్ట్రకు తరలించి అక్కడి నుంచి జిల్లా లబ్ధిదారులకు అమ్మినట్లు గుర్తించారు. ఇలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా వాహనాలకు ‘జీపీఎస్’ అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. పంపిణీ చేసిన ప్రతి గొర్రె ఫొటోతో పాటు లబ్ధిదారుల ఫొటోను ప్రత్యేకంగా రూపొందించిన తెలంగాణ జీవ సమృ ద్ధి వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి గొర్రెకూ ట్యాగ్ నంబర్ వేసి జిల్లాకు తీసుకొచ్చేలా కార్యాచరణను ఖరారు చేసింది. కొనుగోలు చేసిన గొర్రెలను రవా ణా చేసే వాహనాలు బయలు దేరినప్పటి నుంచి అవి గ్రామాలకు చేరే వరకు జీపీఎస్ విధానం అమలవుతుంది. ఒకవేళ లబ్ధిదారులు ఎవరైనా దళారుల వలలో చిక్కి యూని ట్లు విక్రయించుకుంటే కఠిన చర్యలకు సైతం ఆదేశాలిచ్చింది.
మార్పులు, చేర్పులకు అనుగుణంగా చర్యలు
గొర్రెల యూనిట్ల పంపిణీ వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇప్పటికే డీడీలు చెల్లించిన వారిలో కొత్తగా పెరిగిన యూనిట్ ధర ప్రకారం వాటాను కట్టించుకుంటున్నాం. స్వల్పంగా పెరిగిన లబ్ధిదారుడి వాటాను స్వీకరించిన తర్వాత యూనిట్ల పంపిణీ చేపడుతున్నాం. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా గొర్రెల యూనిట్ల పంపిణీ జరుగుతోంది. ఎవరైనా ప్రభుత్వం అందించిన గొర్రెల యూనిట్లను నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు.
-డా.ఎం.భరత్,
పశుసంవర్ధక శాఖ అధికారి, నిజామాబాద్ జిల్లా