వర్ని/చందూర్(మోస్రా)/రూద్రూర్, ఏప్రిల్ 17: రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని మేము తీసుకోబోమంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ.. రైతే ముద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మోస్రా, చందూర్, రుద్రూర్ మండల కేంద్రాలతోపాటు వర్ని మండలం జాకోర, మోస్రా మండలం గోవూర్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆదివారం ప్రారంభించారు. జాకోరలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన జనరల్ ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. చందూర్‌లో 13 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో స్పీకర్ మాట్లాడుతూ.. వడ్లను కొనబోమని కేంద్రం మొండికేస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన గళాన్ని వినిపించారని అన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోలు చేస్తున్న ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి వడ్లను తక్కువ ధరకు అమ్ముకోవద్దని, కొనుగోలు కేంద్రాల్లో రూ. 1960 మద్దతు ధర చెల్లిస్తున్నట్టు చెప్పారు. రైతులు ఆయిల్ పామ్ సాగుచేస్తే మంచి లాభాలు వస్తాయని, రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలను అందజేస్తున్నదని తెలిపారు. అవగాహన కల్పించేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్‌పాం పంటలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఇవన్నీ కండ్లకు కట్టినట్టు కనిపిస్తుంటే ప్రతిపక్షాలు ఇంకా రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఎన్నికల సమయంలో వారి భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ప్రతి గుంటకూ నీటిని అందించేందుకు లిఫ్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఐదు మండలాల ఇఫ్తార్ విందుకు లక్ష రూపాయలు అందజేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఎంసీలు, విండో చైర్మన్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, రైతుబంధు సమితి కన్వీనర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.