బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 17 : సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికీ సొంతింటి కలను సాకారం చేయడమే తన ప్రధాన సంకల్పమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటింటికీ తాగునీరు, గుంటగుంటకూ సాగునీరు అందిస్తామన్నారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆదివారం ప్రారంభించారు. రూ.1.71 కోట్లతో నిర్మించిన 30 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. రూ. 2 కోట్లతో కొత్తగా 40 ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. వీటితోపాటు రూ. 10లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ, రూ. 30 లక్షలతో రామాలయ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రూ. 15 లక్షలతో నిర్మించిన ముదిరాజ్ సంఘం మడిగెలను ప్రారంభించారు. గ్రామానికి చెందిన పది మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఊర చెరువు మరమ్మతులకు రూ. 15 లక్షలు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ. 20 లక్షల నిధులను మంజూరు చేశారు. రంజాన్ మాసం సందర్భంగా మసీదులో ముస్లిములతో కలిసి ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటుచేసిన సభలో స్పీకర్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలోనే అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టింది కేవలం బాన్సువాడ నియోజకవర్గంలోనే అని తెలిపారు. 10 వేల ఇండ్లను ఇప్పటికే మంజూరు చేశానని గుర్తుచేస్తూ.. మరో ఐదువేల ఇండ్లతో ప్రతి కుటుంబానికీ సొంతింటి కలను సాకారం చేస్తానని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అర్హులకు ఇప్పటివరకు అందజేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతి గుంటకూ సాగు నీరు అందించే లక్ష్యంతో నిజాంసాగర్ కాలువలను రూ. 150 కోట్లతో ఆధునీకరించామని తెలిపారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు తరలిస్తున్నామని, ఇక ఆయకట్టు రైతులు పండించే రెండు పంటలకూ సాగునీటికి ఢోకా ఉండదన్నారు. సోమేశ్వర్ గ్రామంలో ఇటీవల పాల శీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, సమీప గ్రామాల ఆడబిడ్డలు ఆసక్తి కనబరిస్తే రెండు బర్రెల చొప్పున ఇప్పిస్తామన్నారు.
కేంద్రం తీరు సరిగా లేదు..
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు సరిగా లేదన్నారు. రైతులను బీజేపీ సర్కారు మోసం చేసిందని స్పీకర్ విమర్శించారు. కొనుగోళ్లపై అనేక ఆంక్షలు విధించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారని అన్నారు. అన్నదాత కన్నీరు పెట్టొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా యాసంగిలో పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. లేదంటే రైతులు ఎకరానికి దాదాపు రూ. 18వేల దాకా నష్టపోయేవారని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, బాన్సువాడ, బుడ్మి సొసైటీల చైర్మన్లు ఏర్వాల కృష్ణారెడ్డి, పిట్ల శ్రీధర్, ఎంపీటీసీ వెంకటరమణ, నాయకులు మహ్మద్ ఎజాజ్, జెట్టి శంకర్, గోవింద్, వీరేశం, మొగులయ్య, గంగారాం పాల్గొన్నారు.