ఎడపల్లి (శక్కర్‌నగర్), ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్పర్సన్ ఎం.రజితాయాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ రైతులకు సూచించారు. ఎడపల్లి ఐకేపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో డీఆర్డీవో చందర్ నాయక్‌తో పాటు పలువురు అధికారులతో కలిసి వారు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రం ధాన్యం కొనుగోలు విషయంలో, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారన్నారు. రైతులు తక్కువ ధరకు, దళారులకు ధాన్యం విక్రయాలు చేయొద్దని సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపడుతున్నారని వివరించారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఎడపల్లి, దుబ్బాతండా, మంగళ్‌పాడ్, బ్రాహ్మణ్‌పల్లి గ్రామాల్లో శనివారం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. స్థానిక రైతు నాయకులు గుంజరి రెడ్డి, ఐకేపీ ఏపీఎం చిన్నోల్ల సాయిలు, సీసీలు మధు, సాయిలు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రాధతో పాటు పలువురు సీసీలు, రైతులు పాల్గొన్నారు.
మద్దతు ధరను పొందాలి..
బోధన్ రూరల్, ఏప్రిల్ 16: రైతులు తాము పండించిన ధాన్యంను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను పొందాలని డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి అన్నారు. బోధన్ మండలంలోని అమ్దాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, బీ గ్రేడ్ ధాన్యానికి రూ.1940 ధర అందిస్తున్నదని తెలిపారు. వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సన్న, కార్యదర్శి సిర్పా సుదర్శన్, విండో కార్యదర్శి రాజేశ్వర్, వినోద్‌నాయక్, ఆయా గ్రామాల సర్పంచు, ఎంపీటీసీలు, ఏఈవో గంగజాల, గ్రామపెద్దలు, రైతులు పాల్గొన్నారు.