నిజామాబాద్‌సిటీ, ఏప్రిల్ 16 : జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యాన్ని సేకరించిన వెంటవెంటనే లారీల్లో రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. కొనుగోళ్లపై తహసీల్దార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలని, అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిచిపోకుండా చర్యలు చేపట్టేందుకు అప్రమత్తంగా ఉండాలన్నారు. హరితహారం మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్క మొక్క ఎండిపోయినా సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే నెల 20న ప్రారంభం కానున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో హరితహారానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీపీవో జయసుధ పాల్గొన్నారు.
సాధారణ ప్రసవాలు చేయాలి..
ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల వైద్యులతో కలెక్టర్ నారాయణరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ కాన్పు అయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ డాక్టర్లు ఆపరేషన్ చేశారంటూ తరుచూ తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి వాటికి ఆస్కారం లేకుండా సాధారణ ప్రసవాలు చేసేందుకు వైద్యులు అంకితభావంతో కృషిచేయాలని కలెక్టర్ సూచించారు. దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే 61 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, ఇందులో నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగానే ఆపరేషన్లు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఆపరేషన్లు చేయాలని సూచించారు. వైద్య రంగాన్ని అప్రతిష్టపాలు చేస్తున్న మధ్యవర్తిత్వ వ్యవస్థను దూరం చేయాలని కోరారు. ఇకపై జరిగే ప్రతి కాన్పుపై నిశితంగా పరిశీలించాలని జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారిణి ఝాన్సీ, డీపీవో జయసుధను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఎంహెచ్‌వో సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.