మద్నూర్/నాగిరెడ్డిపేట్/పిట్లం/లింగంపేట/గాంధారి/తాడ్వాయి/నస్రుల్లాబాద్/ మాచారెడ్డి, ఏప్రిల్ 12: జిల్లావ్యాప్తంగా ఉపాధిహామీ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పలు గ్రామాల్లో కొనసాగుతున్న పనులను అధికారులు మంగళవారం పరిశీలించారు. కూలీల హాజరు, పనుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. పనులకు హాజరయ్యే కూలీల హాజరును పెంచాలని అన్నారు. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కూలీకి వందరోజుల పని కల్పించాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయంపూటే పనులను చేయించాలని, కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కొలతల ప్రకారం పనులను పూర్తిచేస్తే కూలీ గిట్టుబాటు అవుతుందని అన్నారు.
మద్నూర్ మండలం అవల్గావ్ గ్రామంలో కొనసాగుతున్న పనులను ఎంపీడీవో శ్రీనివాస్, లింగంపేట మండలం రాంపల్లి స్కూల్ తండా, జగదాంబ తండాలో చేపట్టిన ఉపాధి పనులను ఎంపీవో ప్రభాకరాచారి పరిశీలించారు. నాగిరెడ్డిపేట్ మండలం పల్లెబొగుడ తండా, జాన్కంపల్లి, రాఘవపల్లి గ్రామాల్లో ఉపాధిహామీ పనులను ఎంపీడీవో రఘు పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ ఉన్నారు. పిట్లం మండలం మద్దెల్‌చెర్వు గ్రామ పంచాయతీలో సిబ్బందితో ఎంపీవో బ్రహ్మం సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. గ్రామ పరిధిలో పనులను గుర్తించి, జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలన్నారు. అనంతరం రాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను పరిశీలించారు. సమావేశంలో ఉపసర్పంచ్ రమేశ్‌గౌడ్, ఎంపీటీసీ నారాయణ, పంచాయతీ కార్యదర్శులు అజ్మీరాబేగం, ప్రవీణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్ మండలం లింగంపల్లి తండాలో చేపట్టిన పనులను ఎంపీవో రాము పరిశీలించారు. అటవీప్రాంతం నుంచి వంటచెరుకును తీసుకెళ్లొద్దని కూలీలకు సూచించారు. ఆయన వెంట సర్పంచ్ మంజుల, గ్రామ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.
పలు గ్రామాల్లో పనులు ప్రారంభం..
తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో చేపట్టనున్న ఉపాధిహామీ పనులను ఎల్లారెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ సాయిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు సభ్యురాలు సావిత్రి, ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష్ పాల్గొన్నారు. మాచారెడ్డి మండ లం అక్కాపూర్, ఇసాయిపేట గ్రామాల్లో ఉపాధి పనులను ఆయా గ్రామాల సర్పంచులు మమత, గాయత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు లత, లక్ష్మి, ఎల్లయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
ఉపాధి పనుల గుర్తింపు..
గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో గుర్తించిన ఉపాధిహామీ పనులను ఎంపీడీవో సతీశ్ పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో భిక్షపతి, సర్పంచ్ కళావతీ లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.