ఖలీల్వాడి, ఏప్రిల్ 12: జిల్లా ప్రభుత్వ దవాఖానలో రోగులకు అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సూచించారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. సంస్థ మేనేజర్ చంద్రశేఖర్, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి దవాఖానలోని వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, మందుల స్టాక్ వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులకు అవసరమైన అన్ని మందులను దవాఖానలోనే అందుబాటులో ఉంచాలన్నారు. బయటి నుంచి మందులు తెచ్చుకునే పరిస్థితి రానివ్వొద్దని దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమారాజ్కు సూచించారు.
అమృత్ ఫార్మసీని తనిఖీ చేశారు. జనరిక్ మందులను తగ్గింపు ధరల్లో అందించాల్సి ఉండగా ఈ మేరకు బోర్డును సరిగ్గా ప్రదర్శించకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అందరికీ కనిపించేలా బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ దవాఖాన ఎదురుగా చేపట్టిన ఎనిమిది అంతస్థులతో కూడిన మాతాశిశు విభాగం భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయినట్లు చైర్మన్ దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. భవనం అందుబాటులోకి వస్తే నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల వారికి మరిన్ని సేవలు అందేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం దవాఖానకు ప్రతిరోజూ 1200 మంది వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 300 మంది కొవిడ్ సోకిన గర్భిణులకు కాన్పులు చేశారని తెలిపారు. మాతాశిశు విభాగం భవనం నిర్మాణం పూర్తయితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. చైర్మన్ వెంట సంస్థ ఎస్ఈ దేవేందర్ ఉన్నారు.