కమ్మర్పల్లి, ఏప్రిల్ 10 : తెలంగాణ వడ్లను కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో సోమవారం చేపట్టనున్న రైతు దీక్షకు ఉమ్మడి జిల్లా నాయకులు వెళ్లారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ స్థాయిల్లో టీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. వడ్లను కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరించడంతో టీఆర్ఎస్ జిల్లా నాయకులు రైతుల పక్షాన పోరాటాలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల మండల, గ్రామ స్థాయిల్లో ధర్నాలు, ర్యాలీలు, నల్లజెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపించడమే లక్ష్యంగా మొదలైన నిరసన కార్యక్రమాలు ఉమ్మడి జిల్లాలో పలు రూపాల్లో కొనసాగాయి. గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌లు, పీఏసీఎస్‌లు, మార్కెట్ కమిటీలు, డీసీసీబీ, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్ తీర్మానాలతో మొదలైన పోరాటం నేడు ఢిల్లీలో కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టనున్న దీక్ష వరకు చేరింది. కేసీఆర్ అమలుచేస్తున్న సాగునీటి రంగ అభివృద్ధి విధానాలతో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు, వాగులు, కాలువలు, చెరువులు జల సిరులుగా మారాయి.
దీనికితోడు మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం, జిల్లాకు కాళేశ్వరం జలాలు అందడం తదితర ప్రోత్సాహ కార్యక్రమాలతో సాగు సంబురంగా సాగుతూ వస్తున్నది. ఈ క్రమంలో వరి సాగు సైతం పెరిగింది. దీంతో వడ్ల దిగుబడులు చూసి మురిసి పోతున్న రైతన్నను కేంద్రం ఆందోళనకు గురి చేస్తున్నది.ఈ పరిస్థితుల్లో రైతు పక్షాన టీఆర్ఎస్ నిలబడింది. కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ వడ్లు కొనుగోలు చేయించే లక్ష్యంతో చేపట్టిన దీక్షలో కేసీఆర్‌తోపాటు జిల్లా నేతలు పాల్గొననున్నారు.