నవీపేట, ఏప్రిల్ 9: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను భార్య హత్యచేయించిన కేసును నవీపేట పోలీసులు ఛేదించారు. మండలంలోని ఫకీరాబాద్ శివారులో గతేడాది నవంబర్ 20న ఈ సంఘటన చోటుచేసుకోగా, హత్యకు సంబంధించిన వివరాలను నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. నవీపేట మండలం ఫకీరాబాద్ గ్రామానికి చెందిన దేవుకార్ గంగాధర్(55)కు సావిత్రితో 25 ఏండ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మూడేండ్ల క్రితం భార్య సావిత్రి అదే గ్రామానికి చెందిన పల్లిగాడు, గొల్ల సాయిలుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. ఈ విషయం తెలుసుకున్న గంగాధర్ మద్యానికి బానిసై, భార్య సావిత్రిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు.
ఈ విషయమై పలుమార్లు కులపెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న పల్లిగాడు, గొల్లసాయిలుతోపాటు తన స్నేహితురాలు గంగామణి, తమ్ముడు బాబుతో కలిసి గంగాధర్ హత్యకు పథకం రూపొందించింది. గతేడాది నవంబర్ 20న గంగాధర్‌కు మాయ మాటలు చెప్పి గ్రామంలోని కల్లు దుకాణంలో అందరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం గ్రామ శివారులోని బాసర రోడ్డు వైపునకు తీసుకెళ్లి గంగాధర్‌కు అతిగా మద్యం తాగించారు. స్పృహ తప్పిన గంగాధర్ మెడకు టవల్‌తో గట్టిగా ఉరివేసి హత్య చేశారు.
మృతదేహాన్ని ఫకీరాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై పడుకోబెట్టారు. పట్టాలపై నుంచి రైళ్లు వెళ్లడంతో మృతదేహం మూడు ముక్కలై గుర్తు పట్టలేని విధంగా మారింది. దీంతో గంగాధర్ రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు నిందితులు చిత్రీకరించగా, నవంబర్ 21న నిజామాబాద్ రైల్వే పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. ఈ విషయమై నిజామాబాద్ సీపీ నాగరాజు ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసీపీ వినీత్, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీఐ వెంకన్న, నవీపేట ఎస్సై రాజారెడ్డి దర్యాప్తు చేపట్టారు. మృతుడి భార్య సావిత్రిని విచారించగా హత్యకేసు విషయం వెలుగుచూసింది. దీంతో నిందితులు దేవుకార్ సావిత్రి, గొల్ల సాయిలు, పల్లెన్న, బొంతల గంగామణిని శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. మరో నిందితుడు ర్యావని బాబు పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసును ఛేదించిన నవీపేట పోలీసులను ఏసీపీ నాగరాజు అభినందించారు.