నిజామాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి):తెలంగాణ వడ్లను కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నిరసనలు హోరెత్తాయి. 5 రోజులుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలతో నిరసనోద్యమం రోజురోజుకూ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సారథ్యం వహించి కార్యకర్తలతో కలిసి కదం తొక్కుతున్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో, జాతీయ రహదారులపై ఇప్పటికే వివిధ రూపాల్లో జరిగిన కార్యక్రమాలకు తోడుగా శుక్రవారం అంతటా నల్లజెండాలు ఎగురవేసి కేంద్ర ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని అందించారు. తెలంగాణలో పండించిన వడ్లను బేషరతుగా కేంద్రమే సేకరించాలంటూ ఊరూరా రైతులు, గులాబీ శ్రేణులంతా ఇండ్లపై నల్లా జెండాలు ఎగురవేశారు. స్వచ్ఛందంగా చాలా చోట్ల రైతులు ముందుకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రధానమంత్రి మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయగా… మున్సిపాలిటీల్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహించారు. నిజామాబాద్ అర్బన్‌లో వేలాది మందితో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ర్యాలీ చేపట్టారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కేంద్రానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసనలు హోరెత్తాయి. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో తన నివాసంపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నల్ల జెండా ఎగురవేశారు. నిజామాబాద్ అర్బన్‌లో ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నగర వీధుల్లో ఓ వైపు టీఆర్ఎస్ జెండాలు, మరోవైపు నల్లజెండాలను చేతబట్టి గులాబీ సైన్యం పెద్ద ఎత్తున నిరసనలో పాలుపంచుకున్నది. అడుగడుగునా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కారు. ఆర్మూర్లోనూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సైతం తన క్యాంప్ కార్యాలయంపై నల్లా జెండాలతో నిరసన తెలియజేశారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్‌లోని తన నివాసం వద్ద నల్ల జెండా ఎగురవేసి ఆందోళన నిర్వహించారు. బోధన్ నియోజకవర్గంలో శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళనల్లో భాగమయ్యారు. కామారెడ్డి నియోజకవర్గం దోమకొండలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ దహనం చేశారు. జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలో బీజేపీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే హన్మంత్ షిండే నిరసన తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణంలో కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జాజాల సురేందర్ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాల్లో నల్ల జెండాలు ఎగురవేసి కార్యకర్తలు సత్తా చాటారు.
ప్రతి ఇల్లు కదిలింది.. నల్ల జెండా ఎగిరింది..
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలకు అద్భుత స్పందన వస్తున్నది. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొంటున్నారు. గడిచిన ఐదారు రోజుల నుంచి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉంటూ శ్రే ణులను ఉత్తేజ పరుస్తున్నారు. నిజామాబాద్ జి ల్లాలో నిరసన కార్యక్రమాలను విజయవంతం చే సేందుకు ఎమ్మెల్యేలు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలతో పార్టీ జిల్లా సారథి జీవన్ రెడ్డి నిత్యం సెల్ కాన్ఫరెన్సులు నిర్వహిస్తూ సమన్వయం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి సెగలు తగిలేలా కార్యాచరణ రూపొందించి పెద్ద సంఖ్యలో శ్రేణులను సమాయత్తం చేస్తూ విజయవంతం చేస్తున్నారు.
ఇక ఢిల్లీకి..
గ్రామం, మండలం, నియోజకవర్గస్థాయిలో వివిధ రూపాల్లో ఆందోళనలు ముగియడంతో ఈ నెల 11న ఢిల్లీలో చేపట్టబోయే నిరసన దీక్షకు టీఆర్ఎస్ సమాయత్తమవుతున్నది. తెలంగాణ వడ్లను కొనాలనే ఏకైక డిమాండ్‌తో సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ముఖ్య నాయకులంతా దేశ రాజధానిలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ రైతులు, ప్రజలపై అవహేళనగా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీరు, తీవ్ర వివక్ష చూపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహారాన్ని ఢిల్లీ వేదికగా యావత్ దేశానికి తెలియజేసేలా సోమవారం జరిగే ఆందోళన ఉండబోతోందని నేతలు చెబుతున్నారు.