నిజామాబాద్ రూరల్, మార్చి 31 : సొంతూర్లోని సర్కారు బడి కాపాడేందుకు అందరూ ఒక్కటయ్యారు. గ్రామాభివృద్ధి కమిటీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, దాతలంతా కలిసి ప్రభుత్వ పాఠశాలకు పూర్వవైభవం తేవాలని సంకల్పించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు చదివే పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అందరూ ముందుకొచ్చారు. ఆరేండ్ల ముందే ఆంగ్ల బోధన మాధ్యమం అవసరాన్ని గుర్తించిన గ్రామస్తులంతా ఆ దిశగా చర్యలు చేపట్టి సత్ఫలితాలు సాధించారు.
నిజామాబాద్ నగర శివారులోని ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న ఖానాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఖానాపూర్ గ్రామానికి చెందిన పిల్లలతో పాటు చుట్టుపక్కల ఫ్యాక్టరీల్లో పనిచేసే మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల కార్మికుల పిల్లలు సైతం ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తుంటారు. ఏండ్ల నుంచి ఈ పాఠశాలల్లో తెలుగు మీడియంలోనే విద్యాబోధన సాగుతున్నది. ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యత ఏర్పడిందన్న విషయాన్ని గ్రహించిన తల్లిదండ్రులు అప్పులు చేసి వారి పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపించారు. దీంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. గమనించిన ఉపాధ్యాయులు 2015లో అప్పటి సర్పంచ్ కోర్వ గంగాధర్, వీడీసీ, ఎస్ఎంసీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. ఫలితంగా ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన ప్రారంభించేందుకు వీడీసీతోపాటు పలువురు దాతలు విరాళాలు అందించారు. 2016-17లో పాఠశాలల్లో తగిన సదుపాయాలు సమకూర్చడంతోపాటు విద్యావలంటీర్లను నియమించి ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతులకు మొదట ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన ప్రారంభించారు. దీంతో క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రైమరీ స్కూల్లో 224 మంది ఇంగ్లిష్ మీడియం విద్యనభ్యసిస్తుండగా, హైస్కూల్లో మొత్తం100 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో ఆరో తరగతి వరకు మాత్రమే ఈ సంవత్సరం ఇంగ్లిష్ మీడి యం విద్యాబోధన ప్రారంభించారు.
స్కూల్ అభివృద్ధికి అండగా నిలుస్తున్న దాత
పేదవర్గ విద్యార్థులు ఇంగ్లిష్ మీడియం విద్యనభ్యసించడానికి అవసరమైన వసతులు సమకూర్చి స్కూల్ అభివృద్ధికి ఖానాపూర్ శివారులోని ఆర్కే ఇండస్ట్రీస్ యజమాని, దాత పవన్ కేడియా అండగా నిలుస్తున్నారు. రూ.40 లక్షలతో ఎనిమిది తరగతి గదులను నిర్మించి ఇచ్చారు. కంప్యూటర్ విద్యాబోధన కోసం రూ.30వేలతో ఒక కంప్యూటర్, మరో రూ.30 వేలతో ప్రొజెక్టర్‌ను కొనుగోలు చేసి పాఠశాలకు అందజేశారు. విద్యార్థులందరికీ ఏకరూప దుస్తులతోపాటు 55 డెస్క్ బెంచీలు అందించారు. సరిపడా తరగతి గదుల నిర్మాణం చేపట్టిన ఫలితంగా ఈ పాఠశాలను జడ్పీ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేసేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు అనుమతినిచ్చారు.
కంప్యూటర్లు వితరణ చేసిన దాతలు
డిజిటల్ చదువుల కోసం దాతలు ఆరు కంప్యూటర్లను సమకూర్చారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిజామాబాద్ రీజినల్ ఆఫీస్ తరఫున మూడు, దాత పవన్ కేడియా ఒకటి, మాజీ ఎంపీ నారాయణరెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు రమేశ్ ఒక్కొక్కటి చొప్పున కంప్యూటర్లను వితరణ చేశారు. దీంతో పాఠశాలలో కంప్యూటర్ విద్యాబోధన ప్రారంభించేందుకు ఉపాధ్యాయులు సన్నాహాలు చేస్తున్నారు.
వీడీసీ తరపున విద్యావలంటీర్ల నియామకం
ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన చేసేందుకు వీడీసీ తరఫున శిక్షణ పొందిన విద్యావలంటీర్లను నియమించారు. హైస్కూల్లో ముగ్గురిని, ప్రైమరీ స్కూల్లో ఇద్దరితో పాటు ఇద్దరు ఆయాలను నియమించి వీరికి నెలకు రూ.36వేల వేతనాన్ని వీడీసీ సభ్యులు అందజేస్తున్నారు.
పేద విద్యార్థులకు ఎంత చేసినా తక్కువే
పేద విద్యార్థుల విద్య కోసం ఒక దాతగా తాను ఎంత వెచ్చించినా తక్కువే. ఈ పాఠశాలలో 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన అందించడమే నా ఏకైక లక్ష్యం. నే ను ఆశించినట్లుగానే రాష్ట్ర ప్రభు త్వం కూడా అన్ని పాఠశాలల్లో ఇం గ్లిష్ మీడియం విద్యాబోధన ప్రారంభించడానికి ఈ విద్యా సంవత్సరం నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించడం సంతృప్తినిచ్చింది.
– పవన్ కేడియా, దాత
దాతలు, వీడీసీ సభ్యుల సహకారంతోనే..
మా పాఠశాల అభివృద్ధికి దాత పవన్ సేట్, వీడీసీ సభ్యు లు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేం. తరగతి గదుల సమస్యను పవన్ సేట్ పరిష్కరించారు. విద్యార్థులు చదువుకునేందుకు ఇప్పుడు అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. దాతల సహకారంతో ఆరు కంప్యూటర్లతో ఈ సంవత్సరం డిజిటల్ విద్యాబోధన ప్రారంభిస్తాం.
– రత్నాకర్, ప్రధానోపాధ్యాయుడు