నిజామాబాద్ క్రైం, ఆగస్టు 1: సబ్ ఇన్స్పెక్టర్ తత్సమాన పోస్టులకు ఈ నెల 7వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష (ప్రాథమిక రాత పరీక్ష)ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని పోలీసు కమిషనర్ కే ఆర్ నాగరాజు సూచించారు. నగరంలోని గిరిరాజ్ కళాశాలలో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లకు సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. పరీక్షా సమయంలో సిబ్బంది, అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలను సీపీ వివరించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొ త్తం 6,684 మంది అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఇందులో జిల్లా కేంద్రంలో 13, ఆర్మూర్ పరిధిలో మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు. పరీక్షా కేం ద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన వసతులను కల్పించాలని సిబ్బందిని సీపీ ఆదేశించారు. అభ్యర్థులు తమ గుర్తింపు కోసం బయోమెట్రిక్ పద్ధతిలో వేలిముద్రలను తీసుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు పరీక్షా సమయానికి గంట ముందుగానే(ఉదయం 9 గంటలకు) కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను సెంటర్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌పై నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని తెలిపారు. ఎవరైనా ఉద్యోగం ఇప్పిస్తామంటూ చెప్పేవారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని అభ్యర్థులకు సీపీ సూచించారు. అలాంటి వారి సమాచారం పోలీసులకు అందించాలన్నారు. అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాప్ తెలిపేలా బస్టాండ్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారని వెల్లడించారు.
ఈ రాత పరీక్ష పూర్తిగా రీజినల్ కో -ఆర్డినేటర్(గిరిరాజు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్)పి. రామ్ మెహన్ రెడ్డి, నోడల్ ఆఫీసర్,అదనపు డీసీపీ ఎం.నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. అవగాహన సదస్సులో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వి.అరవింద్ బాబు, అదనపు డీసీపీ ఉషా విశ్వనాథ్, నిజామాబాద్ ,ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ సీటీసీ ఏసీపీలు వెంకటేశ్వర్,ప్రభాకర్ రావు, నారాయణ, శ్రావణ్ కుమార్, రామారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ (కెమిస్ట్రీ విభాగం) డాక్టర్ ఎం.సునీత, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి, ఐటీ కోర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.