బాన్సువాడ టౌన్, ఆగస్టు 1: పేదలు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు జరుపుకోవడానికి బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో రూ. 50 కోట్లతో 80 ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో ఇప్పటికే కొన్నింటికి ప్రారంభోత్సవాలు చేసినట్లు చెప్పారు. వీటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కల్యాణ వేదికలుగా నామకరణం చేయాలని సూచించారు.
సోమవారం ఆయన పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగమేశ్వరకాలనీలో రూ.25 లక్షలతో చేపట్టనున్న దుర్గాభవానీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాగలితో దున్ని భూమిపూజ చేశారు. అదే కాలనీలో రూ.10 లక్షలతో చేపట్టనున్న హనుమాన్ ఆలయ ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం టీచర్స్ కాలనీలో రూ.14.50 లక్షలతో నిర్మించిన బ్రాహ్మణ సంఘ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభాపతి మాట్లాడారు.
బాన్సువాడ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరో రూ.14 కోట్ల నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. కల్కి చెరువు వద్ద రూ. 4 కోట్లతో పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పట్టణవాసులు తమ ఇంటితోపాటు రోడ్లు, డ్రైనేజీలు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పట్టణంలో సుమారు 70 ఎకరాల భూమిని సేకరించి రెండు వేల మంది పేదలకు స్థలాలను అందించడమే కాకుండా అందులో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేశామని వివరించారు. మోడల్‌గా సంగమేశ్వర కాలనీని అభివృద్ధి చేశామని తెలిపారు.
ఎంత ఖర్చు చేసి ఆలయాలు నిర్మించినా పూజారులు లేనిది వాటికి విలువలేదన్నారు. బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది పేదలు ఉన్నారని అన్నారు. వారికి లక్ష్మీ కటాక్షం లేకపోయినా వారు సరస్వతీ పుత్రులని తెలిపారు. తాడ్కోల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయంలో అర్హులైన బ్రాహ్మణులకు ప్రత్యేకంగా ఇండ్లను కేటాయించామని గుర్తుచేశారు.కార్యక్రమంలో ఆర్టీవో రాజాగౌడ్, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, కమిషనర్ రమేశ్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కౌన్సిలర్లు సరిత, రమాదేవి, లింగమేశ్వర్, రవీందర్ రెడ్డి, బాడీ శ్రీనివాస్, హనుమాన్ వ్యాయామశాల చైర్మన్ గురువినయ్, నాయకులు పాల్గొన్నారు.