శక్కర్‌నగర్/ఆర్మూర్/కమ్మర్పల్లి/మోర్తాడ్/కోటగిరి/ ఇందూరు/ రుద్రూ/భీమ్‌గల్, ఆగస్టు 1 : జిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా బోధన్‌లోని చక్రేశ్వర శివమందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి భక్తులతో అభిషేకాలు, మహారుద్రాభిషేకం, ప్రత్యేకపూజలు, మధ్యాహ్నం అన్నపూజ, అన్నదానం కార్యక్రమాలను ఆలయ అర్చకులు గణేశ్‌శర్మ, మహేశ్ పాఠక్, శివకుమార్ నిర్వహించారు. ఆలయ ఈవో రాంరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ రాములు, ఆలయ కమిటీ చైర్మన్ సింగం భరత్‌యాదవ్, ధర్మకర్తలు లక్ష్మణ్పటేల్, రజినీ నవీన్, చంద్రయ్య, సంగీతాగంగారాం, శ్రీనివాస్ గౌడ్, అనీల్ పర్యవేక్షించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్టపై శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆర్మూ ర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినిత, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రతి సోమవారం భక్తుల కోసం ఏర్పాటు చేయిస్తున్న అన్నప్రసాద కార్యక్రమంలో వారు పాల్గొని సేవ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సయ్య, నందిపేట్ జడ్పీటీసీ ముత్యం, పట్టణ అధ్యక్షులు పూజా నరేందర్, కౌన్సిలర్లు ఖాందేష్ సంగీత, రమేశ్, సర్వసమాజ్ అధ్యక్షుడు రవి, జనార్దన్‌గౌడ్, ఆలూర్ సర్పంచ్ మోహన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలం చౌట్‌పల్లిలోని కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భీమ్‌గల్ వెంకటేశ్వర్లు దంపతులు కోటి లింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాలభైరవ అష్టకం పఠించారు. మిగతా మూడు సోమవారాలు ప్రత్యే క పూజా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ అర్చకుడు గంగాప్రసాద్ దీక్షితులు తెలిపారు. మోర్తాడ్‌లోని శివాలయంలో శివలింగానికి, నంది విగ్రహానికి భక్తులు క్షీరాభిషేకం చేశారు.
కోటగిరి మండలకేంద్రంలోని పోచారం కాలనీలో ఉన్న అభయ బసవేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకపూజలు, అన్నదానం చేశారు. నెల రోజుల పాటు పూజ, అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పత్తి లక్ష్మణ్, విండో చైర్మన్ కూచి సిద్ధు, ఆర్.సుదీప్ కుమార్ పాల్గొన్నారు.
రుద్రూర్ మండలకేంద్రంలోని రాజరాజేశ్వరి ఆలయంలో అర్చకుడు రాజేశ్వర్ అప్ప ఆధ్వర్యంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. సులేమాన్‌నగర్‌లోని గైని గుట్ట బసవేశ్వరాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చనతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్త శివరాజ్ సహకారంతో అన్నదానం చేసినట్లు అర్చకుడు పరమేశ్వర్ మహరాజ్ తెలిపారు.
జిల్లాకేంద్రంలోని జెండా బాలాజీ ఆలయంలో గోదాదేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. ఉదయం 11 గంటలకు అర్చకుడు నాగరాజు ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జాలిగం గోపాల్, కార్యనిర్వాహణాధికారి వేణు, ధర్మకర్తలు మొర సాయిలు, నర్సింగ్‌రావు, రామూగౌడ్, ప్రవీణ్‌గౌడ్, శివప్రసాద్, అలివేలు మంగ, జూనియర్ సహాయకులు ఆంజనేయులు, విష్ణు సహస్రనామ భక్త బృందం పాల్గొన్నారు.
భీమ్‌గల్ మండలంలోని పురాణీపేట్, బాబానగర్ గ్రామాల్లో కొనసాగుతున్న ఆరోగ్య సర్వేను ఎంపీడీవో రాజేశ్వర్ పరిశీలించారు. సర్పంచులు శంకర్, రాములు, కార్యదర్శులు, ఆశ కార్యకర్తలున్నారు.