కామారెడ్డి, ఆగస్టు 1: రెవెన్యూ శాఖలో వీఆర్వోలుగా విధులు నిర్వర్తిస్తున్న వారందరినీ జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖలకు సర్దుబాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 121 జీవో జారీ చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కేటాయించేలా ప్రభుత్వం కలెక్టర్కు బాధ్యతలను అప్పగించింది. డ్రా పద్ధతిలో కేటాయింపులు జరపాలని సర్కారు ఆదేశించింది. ఆ మేరకు కామారెడ్డి జిల్లా పరిధిలోని 195 మంది వీఆర్వోలను లాటరీ పద్ధతిలో వివిధ శాఖలకు కేటాయించారు.
జిల్లా పరిధిలోని 37 డిపార్ట్మెంట్లలో 195 మందిని సర్దుబాటు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పరిపాలనా అధికారి రవీందర్, సీపీవో రాజారాంల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. సర్దుబాటు చేసే సమయంలో అవలంబించిన డ్రా పద్ధతిని వీడియో తీశారు. ఇందులో వీఆర్వోల సంఘం ప్రతినిధులు సుధాకర్ రావు, అశోక్ బల్రాం, జ్యోతి, రవీందర్, చెన్నరాజు పాల్గొన్నారు.
రెవెన్యూ శాఖలో ఇప్పటి వరకు వీఆర్వోలుగా పనిచేసిన వారు ఇక నుంచి జూనియర్ అసిస్టెంట్ హోదాలో పని చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో జూనియర్ అసిస్టెంట్ల ఖాళీల వివరాలను గుర్తించి ఆయా శాఖల విభాగాలకు సర్దుబాటు చేశారు. వ్యవసాయ శాఖలో 7, సహకార శాఖలో 3, బీసీ వెల్ఫేర్లో 5, అటవీ శాఖలో 3, ఆర్థిక శాఖలో 4, వైద్య ఆరోగ్యశాఖలో 7, విద్యాశాఖలో 31, పోలీస్ శాఖలో 3, పరిశ్రమల శాఖలో 3, నీటిపారుదల శాఖలో 33, కార్మిక, ఉపాధి కల్పన శాఖలో 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో 24, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో 44, రెవెన్యూ డిపార్ట్మెంట్లో 8, ఎస్సీ వెల్ఫేర్ శాఖలో 5, రోడ్లు, రవాణా, భవనాల శాఖలో 4, మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 8, మైనార్టీ వెల్ఫేర్ విభాగంలో 2, ప్రణాళికల విభాగంలో 1, పశు సంవర్ధక శాఖలో 1, సమాచార శాఖలో 1, సెకండరీ ఎడ్యుకేషన్లో ఒకరిని కేటాయించారు.
లక్కీ డ్రా ద్వారా వీఆర్వోలను వివిధ శాఖలకు భర్తీ చేశాం. కామారెడ్డి జిల్లాలో 195 మంది వీఆర్వోలను పలు శాఖలకు కేటాయించాం. వీర్వోల సంఘం ప్రతినిధులు, అధికారుల సమక్షంలో సర్దుబాటు చేశాం. వీఆర్వోలు వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాలో విధులు నిర్వహించనున్నారు. వెంటనే సంబంధిత శాఖలో విధుల్లో చేరాలి.
– జితేశ్ వీ పాటిల్, కలెక్టర్, కామారెడ్డి
గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు చేసిన తర్వాత మా పరిస్థితి ఆగమాగమైంది. మా సేవలను ఇతర శాఖల్లో కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం. రెండేండ్లుగా ఏ పని లేక, చేసే పనిలో తృప్తి లేక ఇబ్బందులకుగురయ్యాం. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.
– సైరి పరమేశ్వర్, వీఆర్వో, కామారెడ్డి జిల్లా
వీఆర్వోలను ఒకేసారి ఆయా శాఖల్లో భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. సర్దుబాటు విధానాన్ని లాటరీ పద్ధతుల్లో చేపట్టాలని నిర్ణయించడం ఉత్తమమైనది. అపోహలకు ఆస్కారం లేకుండా పక్కాగా ప్రక్రియను ముగించేందుకు వీలు దొరుకుతుంది.
– శ్యామ్, వీఆర్వో, నిజామాబాద్ జిల్లా