కమ్మర్పల్లి, ఆగస్టు 1: మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కార్యాలయ ఆవరణ నుంచి కలప అక్రమ తరలింపు కేసులో సీజ్ చేసిన బొలెరో వాహనంతోపాటు కలప చోరీకి గురైంది. కార్యాలయ గేట్లను విరగొట్టి..బ్యాటరీ తీసేసి ఉంచిన బొలెరోను, అందులో సీజ్ చేసిన టేకు కలపతో సహా ఎత్తుకెళ్లారు.
అటవీ అధికారుల కథనం.. కమ్మర్పల్లి అటవీ కార్యాలయ పరిధిలోని ఏర్గట్ల మండలంలో గత సంవత్సరం సెప్టెంబర్ 6న టేకు కలప తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అందులోని కలపను అటవీ అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి వాహనాన్ని అందులోని కలపతోసహా కార్యాలయ ఆవరణలోనే ఉంచారు. వివిధ కేసుల్లో మాదిరిగానే ఈ వాహన బ్యాటరీ తీసేసి ఉంచారు.
స్వీపర్ సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చి చూసే సరికి గేటు విరగొట్టి ఉండడం బొలెరో వాహనం లేకపోవడంతో అటవీ రేంజ్ అధికారి రవీందర్, డిప్యూటీ అధికారి తుకారాం రాథోడ్‌కు సమాచారం అందించాడు. దీంతో వారు అక్కడికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. వేరే వాహనానికి బొలెరో వాహనాన్ని కట్టి ఎత్తుకెళ్లారని అధికారులు భావిస్తున్నారు.
అటవీ రేంజ్ కార్యాలయంలో నుంచి వాహనాన్ని చోరీ చేసిన దుండగులు ఆదివారం మధ్యాహ్నం రెక్కీ నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురు వ్యక్తులు బస్టాండు ఎదురుగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్ పక్క సందు నుంచి అటవీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వారు వారిని నిలదీసినట్లు తెలిసింది.
ఇదే సమయంలో ఒక వ్యక్తి తనకు ఫోన్ చేసి బెదిస్తున్నాడని ఓ అటవీ అధికారి ఎఫ్ఆర్వోకు చెప్పినట్లు సమాచారం. ఎఫ్ఆర్వో రవీందర్ దీనిపై మాట్లాడుతూ చోరీకి పాల్పడిన వారితోపాటు..సహకరించిన వారిని పట్టుకొంటామని వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
దశాబ్దాల చరిత్ర ఉన్న కమ్మర్పల్లి అటవీ రేంజ్ కార్యాలయంలో ఎన్నడూ లేని విధంగా చోరీ జరగడం సంచలనం రేకెత్తించింది. ఈ కార్యాలయంలో వివిధ కేసుల్లో స్వాధీనపర్చుకున్న విలువైన వాహనాలు, విలువై కలప ఉంచుతారు. ఈ నేపథ్యంలో కనీస భద్రత లేని పరిస్థితి ఉంది.
ఎప్పుడో ఏదో వాహనం తాకి విరిగిన గేటుకు మమ్మతులు చేయలేదు. కార్యాలయ ఆవరణలో సిబ్బందికి క్వార్టర్లు ఉన్నా అందులో వారు క్రమం తప్పకుండా ఉన్న దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి.