శ్రావణ మాసం రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నెల మొత్తం విశేష పర్వదినాలు ప్రారంభమవుతాయి. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరం. లక్ష్మీదేవి జన్మించింది కూడా శ్రావణ మాసంలోనే అని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహా విష్ణువు జన్మించింది కూడా ఈ శ్రావణ నక్షత్రంలోనే. అందువల్లే ఈ మాసం ఆమెకు ప్రీతికరమైనదని చెబుతారు. ఈ మాసంలో చేసే అన్ని పూజల్లో కెల్లా వరలక్ష్మీ వ్రతం ఉత్తమమైనదంటారు.
మొదట ఈ వ్రతాన్ని పరమేశ్వరుడు పార్వతీ దేవికి వివరించాడంటారు. ఈ వ్రతం చేసిన మహిళలకు పుత్రులు, ధన ధాన్యాలు, సంపూర్ణ సౌభాగ్యం లభిస్తుందని భవిష్యోత్తర పురాణం పేర్కొంటున్నది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఎంతో మహిమ కలిగినదని ఆ రోజున దేవతా శక్తులన్నీ మానవులను అనుగ్రహిస్తాయని చెబుతారు. శ్రావణ పౌర్ణమికి జంధ్యాల పౌర్ణమి, నూలు పౌర్ణమి అనే పేర్లున్నాయి. గాయత్రీ ఉపాసన చేసేవారు నూతన యజ్ఞోపవితాలను ఇదే రోజు ధరిస్తారు. రక్షా బంధన వ్రతం, ఋషి తర్పణం వంటి వైదిక కర్మలు ఇదే రోజు ఆచరిస్తారు.
శ్రవణ నక్షత్రం ప్రవేశంలో వచ్చేదే శ్రావణ మాసం. ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శ్రీనివాసుడి జన్మనక్షత్రం కూడా శ్రవణమే. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం. భక్తిమార్గాల్లో శ్రావణ భక్తి మొదటిది.శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో మహా విష్ణువును పూజిస్తాడని ప్రతీతి. అందుకే శ్రావణ మాసానికి ప్రత్యేకత ఉంది.
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకూ ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసాంతం శ్రవణ నక్షత్రం ఉండడమే కారణమని పండితులు చెప్తున్నారు. ఈ మాసాంతం స్వామిని, అమ్మవారిని కొలిస్తే సకల పాపాలు తొలుగుతాయని నమ్మకం.
శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. రక్షాబంధన్, జంధ్యాల పౌర్ణమిగా జరుపుకొంటారు. అనుబంధానికి ప్రతీకగా రాఖీ పౌర్ణమిని జరుపుకొంటారు.
శ్రావణ కృష్ణపక్ష అష్టమి రోజు శ్రీకృష్ణుడి జన్మాష్టమిగా జరుపుకొంటారు. ఈ ఒక్క వ్రతాన్ని నిష్టతో ఆచరిస్తే సంవత్సరంలో 24 ఏకాదశి వ్రతాలు చేసిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు ప్రతి పల్లె, పట్టణాలు ఉట్టి సంబురాలు జరుపుకొంటాయి. చిన్నారులను గోపికలుగా, కృష్ణులుగా అలంకరించి పండుగ చేసుకుంటారు.
శివ భక్తులు ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు. పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదోతనం కలకాలం నిలుస్తుందని నమ్మకం. శ్రావణ సోమవారం శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహాఋషులు చెబుతారు. ఈ రోజు సాక్షాత్తు విష్ణు మూర్తే శివారాధన చేస్తాడని శాస్త్రం చెబుతోంది. పరమశివుడికి భక్తితో అభిషేకాలు చేస్తే విష్ణువు కూడా అనుగ్రహిస్తాడని విశ్వాసం.
శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి, నారద మునీంద్రుడు సావిత్రీ దేవికి ఉపదేశించిన మంగళగౌరీ వ్రతం ఈ మా సంలో ఆచరించడం ఎంతో ప్రాశస్త్యమైనది. మంగళ గౌరీ కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్యం ఉండదని, సర్వ విధ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని నమ్మకం. కొత్తగా పైండ్లెన వారు ఐదేండ్లు తప్పక ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిదని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వ్రతాన్ని పెళ్లి కాని వారి చేత కూడా చేయిస్తారు.
ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎంతో విశిష్టమైనది. ఈ రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని శాస్ర్తోక్తంగా పూజ
లు చేస్తారు. లక్ష్మీదేవి భక్తసులభురాలు కావడంతో ధనం, భూమి, తెలివి, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, బలం, ఈ అష్ట శక్తులను ప్రసాదిస్తుంది. మహా విష్ణువు లోకాలను రక్షించేవాడు కావడంతో ఈయన ద్వారానే వీటన్నింటిని ప్రసరింపజేసి ఆయురారోగ్య, ఐశ్వర్య, సంతోషాలను లక్ష్మీదేవి కలిగజేస్తుంది. లక్ష్మీదేవికి శుక్రవారం రోజు అత్యంత ప్రీతికరం.
శ్రావణ మాసంలో వచ్చే శనివారా ల్లో ఇంటి ఇలవేల్పును పూజించడం సర్వశుభాలను చేకూరుస్తుంది. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాల్లో పూజలు చేయడానికి కుదరకపోయినా.. కనీసం ఒక్క శనివారమైనా పూజా విధానాన్ని ఆచరిస్తే శుభాలు కలుగుతాయని శాస్ర్తాలు పేర్కొంటున్నాయి.
శ్రావణ శుద్ధ, చవితి, పంచమి రోజు నాగుల చవితి, పంచమి జరుపుకొంటారు. ఈ రెం డు రోజులతోపాటు శ్రావణ మాసం లో వచ్చే శనివారాల్లో పెద్ద లు, పిల్లలు పుట్టల్లో పాలు పోసి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తారు. నాగ ముద్రికలను సమర్పించుకుంటారు. ఇలా చేస్తే సర్పదోషాలు, సర్వదోషాలు పోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
12న ఆచరించే అతి ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం (శ్రావణం ప్రారంభమైన తర్వాత వచ్చే రెండో శుక్రవారం) ఈ వ్రతాన్ని మహిళలు నిష్టగా ఆచరిస్తారు. కొబ్బరికాయకు పసుపు పూసి అమ్మవారికి పూజలు చేస్తారు. అనంతరం సామూహిక కుంకుమార్చన చేస్తారు.
శ్రావణ మాసంలో ఇండ్లన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతాయి. శ్రీమహావిష్ణువు, ఆయన సతీమణి లక్ష్మీదేవికి ప్రత్యేక వ్రతాలు చేస్తా రు. చాంద్రమాసం ప్రకారం శ్రావణాన్ని ఐదో నెలగా పరిగణిస్తారు. ఈ నెల పౌర్ణమిన చంద్రుడు శ్రావణ నక్షత్రం సమీపంలో సంచరిస్తున్నందున శ్రావణమాసం అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ నెలలో వచ్చే మంగళ, శుక్ర, శనివారాలు పుణ్యప్రదమైనవని భావిస్తారు.