ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా వైరస్ కనుమరుగవ్వలేదు. ఆ మహమ్మారి పీడ ఇంకా తొలగి పోలేదు. ఇప్పటికీ క్రియాశీలకంగా ఉన్న వైరస్ తన ఉనికిని చాటుతూనే ఉంది. ఉమ్మడి జిల్లాలో తరచూ కొవిడ్ జాడ వెలుగు చూస్తూనే ఉంది. ఎన్నో ప్రాణాలను బలిగొన్న కరోనా విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు ఇంకా నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్‌ను తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్నది.
ఇప్పటివరకు బూస్టర్ డోస్ 50 వేల లోపు మాత్రమే తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ డోస్ బాగానే తీసుకున్న జనం.. రెండో డోస్‌కు వచ్చే సరికి కాసింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇక, బూస్టర్ డోస్ తీసుకునేందుకైతే అసలు ముందుకే రావడం లేదు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఎంతగా ప్రయత్నిస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి, బూస్టర్ డోసు తీసుకోకుంటే కరోనా మళ్లీ కాటేసే ప్రమాదముంది.. తస్మాత్ జాగ్రత్త!
నిజామాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఎంతో మందిని కబళించిన కరోనా మహమ్మారి విషయంలో ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. కనీస నిబంధనలు పాటించాలన్న స్పృహ కొరవడింది. ప్రాణాలను కాపాడడంతోపాటు వైరస్ వ్యాప్తిని నిలువరించే వ్యాక్సిన్‌ను తీసుకోవడంలోనూ ప్రజల్లో అలసత్వం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండో డోస్‌తోపాటు బూస్టర్ డోస్ తీసుకునేందుకు జనం ముందుకు రావడం లేదు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతున్నది.
వాస్తవానికి అందరూ వ్యక్తిగత స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటే కరోనాకు కళ్లెం వేయడం పెద్ద కష్టమేమీ కాదు. రెండున్నరేండ్లుగా వెంటాడుతున్న మహమ్మారి రూపాంతరం చెందుతూ దశల వారీగా విజృంభిస్తున్నది. థర్డ్‌వేవ్‌ను దాటుకున్న సమాజం ఇప్పుడు మరోసారి వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఉలిక్కిపడుతున్నది. ఈ తరుణంలో అందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఉచితంగా అందిస్తున్న కరోనా టీకాలను తీసుకుని రక్షణ పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచిస్తున్నది. వ్యాక్సినేషన్‌ను కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా నిలిపివేస్తే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వరుసగా లేఖలు సంధించి కేంద్రాన్ని ఒప్పించి టీకాల పంపిణీకి మార్గం సుగమం చేశారు. వ్యాక్సిన్ మూలంగానే ఉధృతంగా ఉన్నటువంటి వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మళ్లీ పెరుగుతున్న కేసుల మూలంగా టీకాలే ప్రజల ప్రాణాలను రక్షిస్తాయని ప్రభుత్వం చెబుతున్నది.
నిజామాబాద్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నది. 12,35,190 మంది మొదటి డోసు, 11,89,940 మంది సెకండ్ డోసు తీసుకున్నారు. 24,585 మంది మాత్రమే ప్రికాషన్ డోసును తీసుకున్నారు. మొత్తం ఇప్పటి వరకు 24,49,715 మందికి వ్యాక్సిన్ చేరింది. ఇందులో మహిళలు అత్యధికంగా 13,11,976 మంది, పురుషులు 11,12,818 మంది ఉన్నారు.
కొవిషీల్డ్ 21,04,689 మంది, కొవాగ్జిన్ 3,01,613, కార్బోవాక్స్ 43,413 మంది తీసుకున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. 12-14 ఏండ్ల మధ్య 43,413 మందికి, 15-17 ఏండ్ల మధ్య 1,13, 401 మందికి, 18-44 ఏండ్లలో 13,84,537 మంది, 45-60 ఏండ్ల వారికి 5,66,922 మందికి, 60 ఏండ్లు పైబడిన వారు 3,34,199 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 16లక్షల 24వేల 307 మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. ఇందులో మొదటి డోసు 8,07,354, రెండో డోసు 7,91,993, ప్రికాషన్ డోసు 24,960 మందికి అందింది.
ఇందులో మహిళలు అత్యధికంగా 8,53,260 మంది ఉండగా, పురుషులు 7,45,812 మంది ఉన్నారు. కొవిషీల్డ్ తీసుకున్న వారే అత్యధికంగా 13,30,757 మంది, కొవాగ్జిన్ 2,55,965 మంది, కొర్బోవాక్స్ 37,585 మంది ఉన్నారు. వీరిలో 12-14 వయస్సు వారు 37,576 మంది, 15-17 వయస్సు వారు 87,504 మంది, 18-44 వయస్సు వారు 8,70,850 మంది, 45-60 వయస్సు వారు 3,81,901 మంది, 60ఏండ్లు పైబడిన వారు 2,41,697 మంది ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలో టీకా తీసుకున్న వారిలో మహిళలే ముందంజలో ఉన్నారు. పురుషుల కన్నా ఎక్కువగా ఆడవారే వ్యాక్సిన్ వేయించున్నారు. మద్యం, పొగాకు తాగే అలవాటు ఉన్న మగవారు కొందరు వ్యాక్సిన్ తీసుకుంటే ఏదైనా హాని కలుగుతుందనే అపోహతో టీకాకు దూరంగా ఉంటున్నారు. వ్యాక్సిన్ మొదలైన తొలి రోజుల్లో గ్రామాల్లో తప్పుడు ప్రచారం జరిగిన నేపథ్యంలో కొద్దిమంది ఇప్పటికీ వాటినే నమ్ముతున్నారు.
వ్యాక్సిన్ తీసుకోవడంతో ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండబోదని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ, వారిలో మార్పు కనిపించడం లేదు. నిజామాబాద్‌లో టీకాలు పొందిన వారిలో మహిళలు ఏకంగా 13,11,976 మంది ఉండగా, పురుషులు 11,12,818 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోనూ ఇదే తీరు కనిపిస్తున్నది. మొత్తం టీకాలు పొందిన వారిలో మహిళల సంఖ్య 8,53,260 కాగా, 7,45,812 మంది పురుషులు ఉన్నారు. వయసు రీత్యా పరిశీలిస్తే వృద్ధులు, చిన్న పిల్లలు ఎక్కువగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకొస్తుండగా మధ్య వయస్కులు మాత్రం తమకేమీ కాదన్న ధీమాతో వెనకుడుగు వేస్తున్నారు.
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఇప్పటి వరకు మొత్తం (ఫస్ట్, సెకండ్, బూస్టర్ డోసులు) టీకా తీసుకున్న వారి సంఖ్య 40.74 లక్షల మంది ఉన్నారు. అయితే వీరిలో మొదటి డోసు తీసుకున్న వారితో పోలిస్తే, రెండో డోసు పొందిన వారు తక్కువగా ఉన్నారు. ఇక రెండు డోసులు వేయించుకుని బూస్టర్ డోసు తీసుకోని వారి సంఖ్య లక్షల్లో ఉంది. ప్రస్తుతం చాప కింద నీరులా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత నెల రోజులుగా ఉమ్మడి జిల్లాలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.
అడపాదడపా 5-10 వరకు పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. టీకాకు దూరంగా ఉన్న వారికి, రెండు డోసులు తీసుకున్న వారికి బూస్టర్ డోసు ఇప్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో బూస్టర్ లేదా ప్రికాషన్ డోసు పొందిన వారు కేవలం 24,585 మంది కాగా, కామారెడ్డిలో 24,960 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లే కాగా, సామాన్య జనం తక్కువగా ఉన్నారు. ప్రజల్లో చైతన్యం కల్పించి మూడో డోసు తీసుకునేలా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
కొవిడ్- 19 మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి. కొవిషీల్డ్, కొవాగ్జిన్, కార్బోవాక్స్ మూడు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. విస్తృతంగా టీకాలు పంపిణీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 180 వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ సంఖ్యను త్వరలోనే 300లకు విస్తరించాలని భావిస్తున్నాము. అవగాహన రాహిత్యంతో వ్యాక్సిన్ తీసుకోకపోవడం మంచిది కాదు. కరోనా నుంచి బలంగా మన ప్రాణాలను కాపాడే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే.
– సి.నారాయణ రెడ్డి, నిజామాబాద్ కలెక్టర్