ఆర్మూర్, జూలై 27: వర్క్ పర్మిట్ ఉంటేనే తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి నర్సింహనాయుడు, ఒమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్ అన్నారు. ఆర్మూర్‌లోని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక కార్యాలయంలో బుధవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెందిన యువకులు వర్క్ విజిట్ వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారన్నారు. పనికి సంబంధించిన వీసా లేకుండా గల్ఫ్ వెళితే అక్కడ చట్టప్రకారం నేరమని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో వర్క్ పర్మిట్ లేనివారు జైలు శిక్ష అనుభవించడంతో పాటు జరిమానా చెల్లించి స్వదేశానికి రావాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. తెలంగాణ యువకులు గల్ఫ్ ఏజెంట్ల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఒమన్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు గుండేటి గణేశ్‌ను మస్కట్‌లో తెలంగాణవాసులకు తెలంగాణ అసోసియేషన్ ద్వారా అందిస్తున్న సేవల గురించి కోటపాటి అడిగి తెలుసుకున్నారు. 20 ఏండ్లుగా ఒమన్‌లో వ్యాపారవేత్తగా స్థిరపడి తెలంగాణ ఒమన్ అసోసియేషన్ స్థాపించి తెలంగాణ వాసులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గుండేటి గణేశ్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో ఒమన్ తెలంగాణ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు బుస్సా శ్రీనివాస్ పాల్గొన్నారు.