నిజామాబాద్ లీగల్, జూలై 27: అర్హత ఉన్న పౌరులందరూ బాధ్యతగా కొవిడ్ బూస్టర్ డోస్ టీకాలు వేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల కోరారు. జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్‌లో బుధవారం నిర్వహించిన బూస్టర్ డోస్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని జన సమూహం నుంచి తరమికొట్టాలని అన్నారు. శాస్త్రవేతలు అహోరాత్రులు పరిశోధనలు చేసి ఒక పవిత్ర కార్యక్రమంగా బూస్టర్ డోస్‌ను సిద్ధం చేశారని, వారి కష్టాన్ని మనం వృథాగా పోనియొద్దని అన్నారు.
మానవ మనుగడకు వాక్సినేషన్ పూర్తి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సుదర్శనం మాట్లాడుతూ.. జిల్లాలో వ్యాక్సిన్లకు కొరతలేదని, ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జిలు అజయ్ కుమార్ జాదవ్, సౌందర్య, భవ్య, న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, ఉదయకృష్ణ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.