నిజామాబాద్ క్రైం, జూలై 27 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ ఓ వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేసి రూ.10లక్షలు దోపిడీ చేసిన ముఠాను వారం రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల పేరు చెప్పి దోపిడీకి పాల్పడడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు సీరియస్‌గా పరిగణించారు.
ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చుకొని కారులో వచ్చిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. దీంతో నిజామాబాద్ ఏసీపీ ఏ.వెంకటేశ్వర్ పర్యవేక్షణలో వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో డి.విజయ్‌బాబు ఆధ్వర్యంలో సిబ్బంది నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించి ఎట్టకేలకు పట్టుకున్నారు. కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో సీపీ నాగరాజు నిందితుల వివరాలను వెల్లడించారు. కేవలం రూ.35 వేలకు తులం బంగారం ఇప్పిస్తామంటూ మంచిర్యాల్ జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్‌ను నమ్మించి రూ.10లక్షలతో అతని స్నేహితుడైన కుమ్రంభీం జిల్లాకు చెందిన శేఖర్ ఈ నెల 19వ తేదీన నిజామాబాద్ జిల్లాకు కారులో తీసుకువచ్చాడు.
అయితే అతని వద్ద నుంచి డబ్బులు దోచుకునేందుకు ముందుగానే ప్లాన్ వేసిన శేఖర్ మరో ఏడుగురు స్నేహితులతో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వారందరూ ఒక కారు, స్కూటీపై వచ్చి తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమంటూ శ్రీనివాస్‌ను బెదిరించి అతని వద్ద నుంచి రూ.10లక్షలు దోచుకొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు 8 మంది పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇందులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను 26వ తేదీన సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. నొగాడే శంకర్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామం సంతనగర్కు చెందిన మండలి బక్కన్న, నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన అభిషేక్, ఆదిలాబాద్ జిల్లా పిప్రికి చెందిన అనప శంకర్‌ను అరెస్టు చేసి వారి నుంచి రూ.4లక్షల 84 వేలు సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీపీ వెల్లడించారు.
రాజు, మల్లేశ్, విజయ్, లింగం అనే మరో నలుగురు పరారీలో ఉన్నారని వారి త్వరలోనే పట్టుకుంటామన్నారు. కేసును త్వరగా ఛేదించిన ఏసీపీ వెంకటేశ్వర్, ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు, ఎస్సై శ్రావణ్ కు మార్, ఏఎస్సై షకీల్, సిబ్బందిని సీపీ నాగరాజు అభినందించారు. వారికి రివార్డు సైతం అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి, ఎస్‌హెచ్‌వో విజయ్ బాబు, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.