కామారెడ్డి, జూలై 27 : గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అందుకు అనుగుణంగా తగు ప్రణాళికలను రూపొందించి గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నది. గతంలో ఉన్న మూస పద్ధతికి స్వస్తి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో పంచాయతీల ఆడిటింగ్ వ్యవస్థకు రూపకల్పన చేసింది.
గ్రామ పంచాయతీ లెక్కలను ఎప్పటికపుడు ఆన్లైన్ విధానంలో అందుబాటులలోకి తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా లెక్కలను వెబ్సైట్లో ఉంచుతున్నది. ఈ విధానంతో నిధుల వినియోగంలో పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో 526 గ్రామపంచాయత్లీలో ఆన్లైన్లో పంచాయతీల ఆడిటింగ్ అమలు చేస్తున్నారు. 2021-22 సంవత్సరానికి గాను ఆన్లైన్ ఆడిటింగ్ ప్రక్రియ గ్రామపంచాయతీల్లో కొసాగుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆన్లైన్ ఆడిటింగ్ ప్రారంభించింది. జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను పంచాయతీల్లో జరిగిన అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలు తదితర లెక్కల ఆడిట్‌ను మొదటిసారి ఆన్లైన్ విధానం ద్వారా చేపట్టారు. మొదటి సంవత్సరంలో 30శాతం మేరకు ఆన్లైన్ ఆడిటింగ్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో 526 గ్రామపంచాయతీలకు గాను కామారెడ్డి డివిజన్లో 164 జీపీలు, ఎల్లారెడ్డి డివిజన్లో 141 జీపీలు, బాన్సువాడ డివిజన్లో 221 గ్రామపంచాయతీలు ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆడిటింగ్ ప్రక్రియను ప్రారంభించారు.
2020-21ఆర్థిక సంవత్సరానికి గాను ఆడిటింగ్ ప్రక్రియను విజయవంతంగా చేపట్టారు. పంచాయతీల వారీగా ప్రత్యేక బృందాలను ఆడిటింగ్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. డివిజన్ల వారీగా, మండలాల వారీగా ఈ ప్రక్రియను నిర్వహిస్తారు. పంచాయతీ కార్యదర్శి, ఆడిటర్లతో జాయింట్ ఖాతా కింద 526 గ్రామ పంచాయతీల్లో లాగిన్ పూర్తి చేసి ఆన్లైన్ ఆడిటింగ్ చేపడుతారు. పంచాయతీ కార్యదర్శి, ఆడిటర్ కలిసి ఆదాయ, వ్యయాలను నమోదు చేస్తారు. పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక లాగిన్ ద్వారా పద్దులఎంట్రీ వివరాలను చేపట్టారు.
గతంలో గ్రామపంచాయత్లీలో అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలు , ఇతర లెక్కలు, ఖర్చులను మ్యానువల్ పద్ధతి ద్వారా ఆడిటింగ్ నిర్వహించేవారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 31 కటాఫ్ కింద ఆడిటింగ్ చేపట్టగా, 2021-22 సంవత్సరానికి గాను ఏప్రిల్ 1వ తేదీనుంచి ప్రారంభమైంది. మే మొదటి వారం నుంచి కేటాయించిన గ్రామ పంచాయతీల వారిగా ఆడిటింగ్ ఆధికారులు ఆన్లైన్లో వివరాలను నమోదు చేసి గత సంవత్సరం పద్దులను పొందుపరుస్తారు.
నిధుల పక్కదారి పట్టించే సర్పంచులకు మాత్రం ఆన్లైన్ ఆడిటింగ్ షాక్ గురి చేయక తప్పదు. మ్యానువల్ పద్ధతితో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉండేది.ఆన్లైన్ విధానంతో పంచాయతీల్లో ఆదాయ, వ్యయాలు మొత్తం ప్రజలకు, అధికారులకు ఎప్పటికప్పుడు తెలుస్తాయి. ఆఫ్‌లైన్ ఆడిటింగ్‌లో ఉన్న ఇబ్బందులు ఆన్లైన్ పద్ధ్దతిలో కనపడవు.