వానకాలం వచ్చిందంటే ఒకప్పుడు రైతులు మొగులుకేసి చూసే వారు.. భారీ వర్షాలు పడితేనే అరక పట్టే వారు. లేదంటే పంటలపై ఆశలు వదులుకునే వారు. అయితే, కాలం మారింది. కావాల్సినంత నీరుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ ప్రయత్నాలతో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. సాగునీటి కష్టాలు దూరమయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు లోటు వర్షపాతమే నమోదైంది. వానలతో సంబంధం లేకుండానే రైతులు ముందుకు‘సాగు’తున్నారు. జలాశయాలతోపాటు చెరువుల్లో దండిగా నీళ్లుండడంతో విత్తనాలు వేయడంలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉత్సాహంగా పంటలు సాగు చేస్తున్నారు. చారిత్రక నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు జూన్ మాసంలోనే నీటిని విడుదల చేయడం రాష్ట్ర ప్రభుత్వ దార్శనికత, పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది.
నిజామాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం వచ్చిందంటే రైతులు నిత్యం మొగులు వైపు చూసే గడ్డు పరిస్థితులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కనిపించేవి. వర్షాలు అనుకూలిస్తే రైతులు నాట్లకు ఏర్పాట్లు చేసుకునేది. సీజన్ ఆరంభంలో కురిసిన వానల తీవ్రత ఆధారంగానే అన్నదాత ధైర్యంగా అడుగు ముందుకేసేది.
వర్షాభావ దుస్థితి తలెత్తితే నష్టాల మూట కట్టుకోవడం ఎందుకని భావించి కొంతమంది వెనుకంజ వేసిన దాఖలాలు సైతం ఉండగా చాలా మంది జూన్‌కు బదులుగా జూలై నెలాఖరు వరకు ఆలస్యంగా పనులు మొదలు పెట్టేది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో సాగు పరిస్థితులన్నీ రైతులకు అనుకూలంగా మారాయి. ఉదాహరణకు చారిత్రక నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ప్రస్తుతం జూన్ మొదట్లోనే నాట్లతో సందడిగా గడుపుతున్నారు.
దీనికి ప్రాజెక్టులో 6 టీఎంసీల మేర నీటి నిల్వ ఉండడమే కారణంగా చెప్పవచ్చు. గడిచిన దశాబ్ద కాలంలో జూన్ నాటికి ప్రాజెక్టులో ఇంతగా నీటి నిల్వ ఉండడం అరుదు కాగా… ప్రభుత్వ చర్యల ఫలితంగా యాసంగి వినియోగం అనంతరం వానకాలానికి సరిపడా జలాలను కాపాడుకోవడం ప్రస్తుతం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ప్రతిష్టాత్మక పథకం మిషన్ కాకతీయ. బోసిపోయిన వందలాది చెరువులను బాగు చేయడం ద్వారా నీటి నిల్వ శాతం పెరిగేలా చేశారు. గతంలో వరద నీరు వచ్చింది వచ్చినట్లే దిగువకు పోయేది. సీజన్ తర్వాత మచ్చుకూ నీళ్లుండేవి కాదు. పూడికతీత అనంతర కాలంలో ఐదారేళ్ల నుంచి ఉమ్మడి జిల్లాలో ఎటు చూసినా తటాకాల్లో జలకాంతులు విరబూస్తున్నాయి.
యాసంగికి నీటి సరఫరా చేయగా వానకాలంలోనూ రైతులకు దండిగా ధైర్యాన్నిచ్చేలా తటాకాలు రూపాంతరం చెందాయి. ఉభయ జిల్లాల్లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 3,135 చెరువులున్నాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో 2167, నిజామాబాద్‌లో 968 తటాకాలున్నాయి. 2021 వానకాలంలో భారీ వానలతో చెరువులు, కుంటలన్నీ అలుగు పోశాయి. పూర్తిస్థాయి నీటిమట్టంతో కళకళలాడాయి. ప్రస్తుతం సగం చెరువుల్లో 50శాతం మేర నిల్వ ఉన్న నీళ్లతో వానకాలాన్ని సులువుగా దాటే పరిస్థితి ఉంది. మిగిలిన చెరువుల్లో 30-40శాతం మేర నీటి నిల్వ ఉన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. కొన్ని అడుగంటగా భారీ వానలు కురిస్తే స్వల్పకాలంలోనే మత్తడి దుంకడం ఖాయమే.
దేశంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో సాగుదారులకు పుట్టెడు కష్టాలు మోపైతున్నాయి. రాష్ట్రంలో కర్షక అనుకూల ప్రభుత్వం ఉండడంతో ఎన్ని కష్టాలైనా సరే సీఎం కేసీఆర్ ఓర్చుకొని పాలన కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించి రైతుబంధుకు సైతం డబ్బులు అందకుండా చేయాలనే కుట్రలకు దిగినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ధైర్యంగా నిధులను సమీకరించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుతో కొంత కాలంగా వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది.
ఈ దుస్థితిలో సాగుకాలంలో వివిధ పనులు చేసేందుకు యంత్రాల వినియోగం అనివార్యమైంది. ఏడాది కాలంలో భారీగా పెరిగిన డీజిల్ ధరలతో యంత్రాల ధరలు సైతం ఎగబాకడంతో పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఇంతటి గడ్డు పరిస్థితికి బీజేపీ ప్రభుత్వం కారణమవుతుండగా, రైతుల కన్నీళ్లు తుడుస్తూ సీఎం కేసీఆర్ మాత్రం వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వానకాలం సాగు ప్రారంభం కాగా రైతులంతా హుషారుగా వ్యవసాయ పనుల్లో మునిగి తేలుతున్నారు. జూన్ 28 నుంచి రైతుబంధు పంపిణీ మొదలవుతుండడంతో పెట్టుబడికి దిక్కులు చూడాల్సిన అవసరమే ఉండబోదు. సులువుగా సాగు పనులను చేసుకునే వెసులుబాటు వారికి లభించబోతున్నది.
వానకాలం మొదలై దాదాపుగా నెల ముంచుకొస్తున్నది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 24నాటికి జిల్లాలోని ఆయా మండలాల్లో కనిష్ఠంగా సగటున 12.3 సెం.మీటర్ల నుంచి గరిష్ఠంగా 14.1 సెం.మీటర్ల వర్షం కురిస్తే సాధారణ వర్షపాతంగా గణిస్తారు. కేవలం మోర్తాడ్, నిజామాబాద్ రూరల్, నవీపేట మండలాల్లోనే సాధారణ వర్షపాతానికి మించింది. 9మండలాల్లో మోస్తరు వానలే కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 13మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
మోస్రా, ధర్పల్లి, మోపాల్, ఇందల్వాయిలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. మొత్తానికి జిల్లా సగటు సాధారణ వర్షపాతం 13.2 సెం.మీటర్లు కాగా ఇప్పటి వరకు 10.02 సెం.మీటర్ల లోటు వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లాలో జూన్ 24వ తేదీ వరకు జిల్లా సగటు వర్షపాతం 11.79 సెం.మీటర్లు కాగా 10.29 సెం.మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మద్నూర్, జుక్కల్, భిక్కనూర్, మాచారెడ్డిలో, సాధారణంగా 11 మండలాల్లో వర్షపాతం నమోదైంది. ఏడు మండలాల్లో స్వల్పంగానే వానలు కురిశాయి.
ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఇటీవల కురిసిన స్వల్ప వానలతోనే వరద మొదలైంది. 150 క్యూసెక్కులతో నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఇన్‌ఫ్లో ప్రస్తుతం 4294 క్యూసెక్కులకు చేరింది. ఎగువ నుంచి వరద వస్తుండడంతో ఆయకట్టు రైతుల్లో సంతోషం కనిపిస్తున్నది. మహారాష్ట్రలో కురిసే భారీ వానలపైనే పోచంపాడ్ భవితవ్యం ఎక్కువగా ఆధారపడుతుంది. మరోవైపు కొద్దిరోజుల్లోనే బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తనుండడంతో ఎగువ కురిసిన వానలతో ప్రాజెక్టు నిండడం ఖాయంగానే కనిపిస్తున్నది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎస్సారెస్పీలో 21.910 టీఎంసీల మేర నీటి నిల్వ ఉన్నది. దిగువ జగిత్యాల, నిర్మల్ జిల్లా వాసులకు ఈ నీటితో వానకాలం గట్టెక్కే వీలున్నది. నిజామాబాద్ పరిధిలోని ఆయకట్టు రైతులకు సైతం కాసింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరితే బ్యాక్ వాటర్ ఆధారంగా నడిచే ఎత్తిపోతల పథకాలన్నీ ప్రారంభమవుతాయి. తద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరందుతుంది. నాలుగేండ్లుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది.
ఈ ఏడాది కూడా ఇదే ఆశావాద దృక్పథంతో ఆయకట్టు రైతులున్నారు. ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కాళేశ్వరం నీటిని ఎదురెక్కించి జలకళను సంతరించుకునేలా చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తున్నది.
నిజాంసాగర్ ఆయకట్టు కింద పంటలు సాగు చేస్తే చేతికందే వరకు అనుమానంగానే ఉండేది. వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి పొంగిపొర్లుతున్నా నిజాంసాగర్‌లోకి మాత్రం చుక్క నీరు వచ్చేది కాదు. ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించడంతో కొన్నేండ్ల నుంచి నిజాంసాగర్ బోసిపోతున్నది. అలాంటిది కేసీఆర్ సారు కృషితో కాళేశ్వరం నీళ్లు నిజాంసాగర్‌కు వచ్చాయి. నాట్లు వేసుకునేందుకు నీరు నిల్వ ఉండడం చాలా సంతోషంగా ఉంది.
– రౌతు పోచయ్య, నిజాంసాగర్ ఆయకట్టు రైతు , తున్కిపల్లి
రెండేండ్లుగా నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు సీఎం కేసీఆర్ సారు భరోసానిస్తున్నారు. ఎప్పుడూ చూడని విధంగా జూన్ నెలలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో ఎలాంటి ఢోకా లేకుండా సాగర్ నీరు అందుతుంది. దీంతో రెండు పంటలను సాగు చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా నీటిని విడుదల చేయడంతో వరి సాగుకు శ్రీకారం చుట్టాం.
– గంగాధర్‌గౌడ్, నిజాంసాగర్ ఆయకట్టు రైతు, బుర్గుల్