నిజామాబాద్ క్రైం, మే 25: స్థానిక కోటాలోని ఉద్యోగాలతోనే సరిపెట్టుకోకుండా జోనల్, మల్టీజోనల్ కొలువులను సైతం నూటికి నూరు శాతం నిజామాబాద్ జిల్లా అభ్యర్థులే కైవసం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. సరైన ప్రణాళికను నిర్దేశించుకొని శ్రద్ధతో కష్టపడి చదివితే కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులువేనని అన్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజుతో కలిసి స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శిక్షణ కేంద్రాలను నిర్వహించడంలో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు. జిల్లా యువత మేలు కోరి.. ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 89 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర యువతకు పూర్తి న్యాయం చేయాలనే సంకల్పంతో స్థానికత జీవోను జారీ చేయించారని తెలిపారు. రాష్ట్ర సాధన ఎంత గొప్పదో.. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో 317 జీవోను అమలుచేయడం అంతే గొప్పదని మంత్రి వ్యాఖ్యానించారు.
సీఎం కృషితోనే 95 శాతానికి పైగా ఉద్యోగాలు స్థానికులకు దక్కనున్నాయని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 1,997 ఉద్యోగాలు స్థానిక కోటాలో భర్తీ కానున్నాయని, వీటితోపాటు జోనల్, మల్టీజోనల్ కొలువులను సైతం జిల్లా అభ్యర్థులే సాధించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కోచింగ్ సెంటర్లకు దీటుగా అన్ని వసతులను సమకూరుస్తూ నాణ్యమైన శిక్షణను ఉచితంగా అందిస్తున్నామని, ఈ సదావకాశాన్ని జారవిడుచుకోవద్దని సూచించారు. ఇంకా ఎలాంటి సహాయం అవసరం ఉన్నా, అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పోటీపరీక్షలకు ఉపకరించే రీతిలో ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ను జూన్ 2న ఆవిష్కరిస్తామన్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా అకుంఠిత లక్ష్యంతో ముందుకు సాగాలని అభ్యర్థులకు సూచించారు. మంత్రి కృషికి తగిన గుర్తింపు తేవాలన్నారు. ఇప్పటికే అభ్యర్థులు 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారని, చివరి వరకూ ఇదే పట్టుదలతో కష్టపడి ఉద్యోగం సాధించాలని సూచించారు. సీపీ మాట్లాడుతూ.. తాను కోరిన వెంటనే ఉచిత శిక్షణకు సహకరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
135 మంది అభ్యర్థులకు ఎమ్మెల్సీ కవిత ఉచిత భోజన వసతిని కల్పిస్తున్నారని తెలిపారు. ఉచిత శిక్షణ, వసతి కల్పించడంలో నిజామాబాద్ జిల్లా ముందంజలో ఉందన్నారు. మరో 200 మందికి వసతి కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ వివరించారు. నుడా చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, డీసీపీ వినీత్, ఆర్డీవో రవి, కోచింగ్ కేంద్రాల సమన్వయకర్త చక్రవర్తి, తారీఖ్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.