ప్రగతి పథంలో నిజామాబాద్ జిల్లా పరుగులు పెడుతున్నదని రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేక పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మక పథకాలు తీసుకురావడంతో ఇందూరు ప్రగతి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం నిజామాబాద్ కలెక్టరేట్లో మంత్రి వేముల జాతీయ జెండాను ఆవిష్కరించారు. జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్‌రావు, వీజీ గౌడ్, రఘోత్తమ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ నాగరాజు, అధికారులు పాల్గొన్నారు. పతాకావిష్కరణ అనంతరం మంత్రి వేముల పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. జిల్లా ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు.
రైతుబంధు పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10 వేలు నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్నది. 2022-23లో 2,60,333 మందికి రూ.267.26 కోట్లు జమ చేశాం. జిల్లాలో ఇప్పటి వరకు రూ.2120.90 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. రైతుబీమా పథకం కింద ఇప్పటి వరకు 3,749 రైతు కుటుంబాలకు రూ.145.25 కోట్లను అందజేశాము. 2022-23 వానకాలంలో 91,918 మెట్రిక్ టన్నుల ఎరువులను సరఫరా చేయగా 38,043 మెట్రిక్ టన్నుల ఎరువులు వివిధ సంఘాల్లో నిల్వ చేశాము. ఎకరానికి రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం కల్పించే ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం. 2021-22లో 12.50 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యం కాగా, 4.16 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి జరిగింది. 2022-23 సంవత్సరానికి 4.85 కోట్ల చేప పిల్లల పంపిణీ జరుగుతున్నది.
రూ.954.77 కోట్లతో నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలు, ఉప కాలువల ఆధునికీకరణ కోసం పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో నిజామాబాద్ జిల్లాలో రూ.413.15 కోట్లు ఖర్చు చేసి 8 పనులు పూర్తి చేశాం. మిషన్ కాకతీయ కింద రూ.217.11 కోట్లతో 1,147 చెరువులను పునరుద్ధరించాం. రూ.162 కోట్లతో 32 చెక్‌డ్యామ్ నిర్మాణాలు చేపట్టాం. రూ.11.71కోట్లతో నిజాంసాగర్ చివరి ఆయకట్టు భూములకు నీరు అందించే ఉద్దేశంతో మాక్లూర్ మండలం ధర్మోరా ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశాం. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకంలో భాగంగా ఇప్పటికే జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద మొదటి దశ, రాజేశ్వర్‌రావు పేట వద్ద రెండో దశ, ముప్కాల్ వద్ద మూడో దశ పనులు పూర్తయ్యాయి.
రూ.892 కోట్ల వ్యయ అంచనాతో సారంగపూర్ సర్జిపూల్ వద్ద ప్యాకేజీ 20 కింద 3 పంపులు మంజూరు కాగా పంప్ హౌస్ బిగించే పనులు పురోగతిలో ఉన్నాయి. మంచిప్ప వద్ద ప్యాకేజీ 21లో సర్జిపూల్ నుంచి నీటిని ఎత్తిపోయుటకు 2 పంపుల నిర్మాణం కోసం రూ.545 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. జిల్లాలో 35 చిన్న నీటి పారుదల ఎత్తిపోతల పథకాల ద్వారా 59 వేల ఎకరాలకు సాగు నీరందుతున్నది. రూ.149.66కోట్లతో ఆర్మూర్, బాల్కొండ మండలంలోని ఫత్తేపూర్, సుర్భిర్యాల్, చిట్టాపూర్‌లోని 9,214 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. సిద్దాపూర్ రిజర్వాయర్ ద్వారా వర్ని మండలంలోని 6 గ్రామాల పరిధిలో 2,850 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు జకోరా, చందూర్ లిఫ్ట్‌లు నిర్మిస్తున్నాం.
2021-22 వానకాలంలో 458 కేంద్రాల ద్వారా 89,413 మంది రైతుల నుంచి 6.86 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాం. యాసంగిలో 460 కేంద్రాల ద్వారా 6.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 81,239 మంది రైతులకు రూ.1238.59 కోట్లు అందించాం. పల్లె ప్రగతి ద్వారా రూ.426.30కోట్లు నేరుగా గ్రామ పంచాయతీలకు విడుదలయ్యాయి. పట్టణ ప్రగతి కింద రూ.116కోట్లు మంజూరయ్యాయి. వైకుంఠధామాలు, సమీకృత మార్కెట్లు, ట్రీ పార్కులు, క్రీడా ప్రాంగణాలు వంటి కార్యక్రమాలు చేపట్టాం.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 54,456 కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం. గర్భిణులకు రూ.65.22 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించాం. నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో తీసుకొచ్చిన మన ఊరు – మన బడి పథకం కింద తొలి విడుతలో జిల్లాలోని 407 బడుల బాగు కోసం రూ.160 కోట్ల వ్యయంతో పనులు చేపట్టాం. జిల్లాకు 14,825 ఇండ్లు మంజూరయ్యాయి. 2,569 ఇండ్లు పూర్తి కాగా, 10,258 ఇండ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. హరితహారంలో భాగంగా 2022-23లో లక్ష్యానికి మించి మొక్కలు నాటాం. జిల్లాలో ఎన్‌హెచ్ 44, ఎన్‌హెచ్ 63 రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్‌ను పూర్తి చేశాం.
జిల్లాలోని రోడ్లకు మహర్దశ కలుగుతున్నది. వివిధ పథకాల ద్వారా వచ్చిన రూ.1194.74 కోట్ల వ్యయంతో 269 పనులు చేపట్టాం. 174 పనులు పూర్తి కాగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఎస్సీ కుటుంబాలకు ఆర్థిక సాధికారత, సామాజిక అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన దళితబంధు పథకం కింద జిల్లాలో 550 కుటుంబాలకు లబ్ధి జరిగింది. రూ.53 కోట్లతో లబ్ధిదారులకు వివిధ యూనిట్లు అందించాం. కల్యాణలక్ష్మి పథకం కింద 38,966 లబ్ధిదారులకు రూ.368.18 కోట్లు, షాదీముబారక్ ద్వారా 15,311 మందికి రూ.140.01 కోట్లను అందించామని మంత్రి వివరించారు.