బాన్సువాడ టౌన్, ఆగస్టు 13: ఎంతో మంది ప్రాణత్యాగం చేసి దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించారని, వారి స్ఫూర్తితో నేటి యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలని, దేశం కోసం సేవ చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడలో శనివారం రెండు వేల అడుగుల పొడవైన జాతీయ జెండాతో ఫ్రీడమ్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని స్పీకర్ ప్రారంభించి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభాపతి మాట్లాడారు. జాతీయ పండుగ కులానికి, మతానికి, ప్రాంతానికి, సంబంధించినది కాదని దేశంలోని ప్రతి ఒక్కరి పండుగ అని తెలిపారు. అందరికీ సమాన హక్కులు, సౌకర్యాలు కల్పించడమే నిజమైన స్వాతంత్య్రం అని సూచించారు. యువతదేశ సేవలో పాలుపంచుకోవాలని అన్నారు. అధికార దాహంతో కొంత మంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ఇది మంచి పద్ధ్దతి కాదని, సమాజంలో మంచి మార్పు రావాలని ఆకాంక్షించారు.
అంబేద్కర్ ఆధ్వర్యంలో రచించిన రాజ్యాంగం ప్రకారం అందరం నడుచుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, అందుకు సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, బాన్సువాడ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత బాలకృష్ణ గుప్తా, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్ నాయక్, హనుమాన్ వ్యాయామశాల చైర్మన్ గురు వినయ్, మాజీ ఎంపీపీ ఎజాస్, బాన్సువాడ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్, బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుడు అలీమొద్దీన్ బాబా, సభాపతి వ్యక్తిగత సహాయకుడు భగవాన్‌రెడ్డి, మండల నాయకుడు వెంకట్రామ్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కమిషనర్ రమేశ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి లింగమేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.