నిజామాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమాజరక్షణకు నిత్యం పాటుపడుతూ, క్రమశిక్షణకు చిరునామాగా ఉన్న పోలీసుశాఖ కొద్దిరోజులుగా అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నది. కొంతమంది అడ్డదారులు తొక్కి పోలీసుశాఖకు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. ఏసీబీ దాడులతో కొందరి అవినీతి బోగోతం బట్టబయలు కావడం, ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారింది. నిజామాబాద్ కమిషనరేట్‌లో కొన్నిరోజులుగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొన్నది. కొన్నిరోజుల క్రితం వేల్పూర్ ఎస్సై అటాచ్మెంట్, నిజామాబాద్ నగరంలో ఇద్దరు ఎస్సైలను తప్పించడం, తాజాగా బోధన్ డివిజన్లో మరో ఇద్దరు ఎస్సైలు సెలవులపై వెళ్లడం కలకలం రేపుతున్నది. ఎడపల్లి, రెంజల్ ఎస్సైల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ దీర్ఘకాలిక సెలవులు పెట్టి ఠాణాల నుంచి తప్పుకోవడంపై ఆసక్తి నెలకొన్నది. ఒకే డివిజన్, ఒకే సర్కిల్ పరిధిలోని రెండు పక్క పక్క మండలాలకు చెందిన ఎస్సైలు ఒకరి తర్వాత మరొకరు సెలవులపై వెళ్లిపోవడం విస్మయానికి గురిచేస్తున్నది. ఆరోగ్య సమస్యలతో విధులకు దూరం అవుతున్నట్లు ఎస్సైలు అధికారికంగా చెబుతున్నప్పటికీ, తెర వెనుక రాజకీయ నేతల ఒత్తిడి కారణమా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాలతో విధుల నుంచి తప్పుకున్నారా? అనే చర్చ నడుస్తోంది. సెలవులపై వెళ్లిన ఎస్సైల స్థానంలో కొత్త వారికి పోస్టింగ్‌లు కూడా ఇవ్వలేదు. సీఐలకు బాధ్యతలు అప్పగించి ఠాణాలను నడిపిస్తున్నారు. ఎస్సైలుగా పోస్టింగ్ ఇచ్చేందుకు పూర్తి స్థాయి సీపీ లేకపోవడంతోపాటు రాజకీయ పైరవీలు బలంగా ఉన్నాయనే కారణాలు కనిపిస్తున్నాయి.
రెంజల్ ఠాణాలో ఓ గిరిజన రైతు అనుమానాస్పద మృతితోపాటు కామారెడ్డిలో టేక్రియాల్(అడ్లూర్ ఎల్లారెడ్డి) పెద్ద చెరువులో ఎస్సై, కానిస్టేబుల్, మరో యువకుడి ఆత్మహత్య ఘటనలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. నెలలు గడుస్తున్నా ఈ వ్యవహారం ఇంకా కొలిక్కిరాలేదు. మరోవైపు పూటకొకరు ఏసీబీకి చిక్కుతుండడంతో పోలీస్ శాఖ పరువు మంటగలుస్తున్నది. కింది స్థాయిలో పోలీసుల అక్రమాలు, అవినీతి కేసులు, మానవ హక్కుల సంఘాల నుంచి నోటీసులు, లోకాయుక్తా నుంచి పిలుపు వంటివి ఉన్నతాధికారులకు తలవంపులు తీసుకువస్తున్నాయి. నిజామాబాద్‌లో ఓ ఉన్నతాధికారి స్వయంగా భూ లావాదేవీల్లో పాత్రధారుడిగా మారి సెటిల్మెంట్లకు పాల్పడుతుండడం తీవ్ర దుమారం రేపుతోంది.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్వాల్ కరువయ్యారు. నాలుగు నెలలుగా సీపీ లేకపోవడంతో పాలన గాడి తప్పింది. సీపీ బదిలీపై వెళ్లిన కొద్ది రోజులకే వర్నిలో ఎస్సై కృష్ణ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కాడు. ఆ తర్వాత పలుచోట్ల ఠాణాలను అడ్డాగా చేసుకుని దందాలు, సెటిల్మెంట్లు, ఇసుక వ్యాపారులతో ములాఖత్‌లతో ఖాకీల ఇష్టారాజ్యం పెరిగింది. అడిషనల్ డీసీపీ హోదాలో బస్వారెడ్డి ఉన్నప్పటికీ ఇన్చార్జీ సీపీ ఆదేశాల మేరకు పని చేస్తున్నారు. ఇన్చార్జి సీపీ కామారెడ్డి జిల్లా పరిపాలనలో ఉన్నప్పుడు అడిషినల్ డీసీపీ ఇక్కడి వ్యవహారాలను చూసుకుంటున్నారు. కీలకమైన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రస్తుతం అడిషినల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్ ) పోస్టు ఖాళీగానే ఉంది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ లేడు. టాస్క్‌ఫోర్స్‌లో ఒక సీఐ ఉన్నప్పటికీ మరో సీఐ రావాల్సి ఉంది. కింది స్థాయిలో సిబ్బంది నియామకం చేపట్టలేదు. ఇన్చార్జి సీపీగా సీపీగా, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ రెండు బాధ్యతలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.
నిజామాబాద్ సీపీగా కల్మేశ్వర్ సింగెనవార్ ఉన్నప్పుడు ఖాకీలు భయంతో పని చేశారు. కేంద్ర సర్వీసులకు బదిలీపై కల్మేశ్వర్ వెళ్లి నాలుగు నెలలు గడిచినప్పటికీ ఇంత వరకూ కొత్త అధికారిని ప్రభుత్వం నియమించలేదు. వ్యక్తిగత కారణాలతో కామారెడ్డి ఎస్పీ సింధూ శర్మ సైతం ఇప్పటికే ఉన్నతాధికారులకు బదిలీ దరఖాస్తును సమర్పించారు. ఓవైపు ఎస్పీగా, మరోవైపు ఇన్చార్జి సీపీగా రెండు జిల్లాల్లో తలామునకలవుతుండగా, కింది స్థాయిలో కొంత మంది ఖాకీలు అదుపు తప్పి ప్రవర్తిస్తుండడం ఇబ్బందిగా మారింది. స్వయంగా డీజీపీ జితేంద్రప్రసాద్ రంగంలోకి దిగి ఇసుక అక్రమాల్లో తలదూర్చకూడదని చెబుతున్నప్పటికీ బాన్సువాడ డివిజన్లో ఓ అధికారితో సహా పలువురు సీఐలు, ఎస్సైలు చెలరేగిపోతున్నారు. ఎమ్మెల్యే అండదండలతో పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు. దీంతో వరుసగా మూడు నెలల క్రితం వర్ని ఎస్సై కృష్ణ, ఆ తర్వాత లింగపేటలో ఎస్సై అరుణ్ కుమార్, మొన్న ఎస్సై సుధాకర్ లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కడం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలీసుల పనితీరును ప్రస్ఫుటం చేస్తున్నది. ఏసీబీ వరుస దాడుల ఘటనలతో కాసులిస్తే కానీ ఠాణాల్లో పని జరగదనే చందంగా మారింది.