నిజామాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టి.వినయ్ కృష్ణారెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వినయ్‌కృష్ణారెడ్డిని నిజామాబాద్ కలెక్టర్‌గా నియమించారు. ఆయన ప్రస్తుతం పునరావాసం, భూసేకరణ (ఆర్అండ్ఆర్, ఎల్ఏ), నీటిపారుదల శాఖ కమాండ్ ఏరియా అభివృద్ధి విభాగం కమిషనర్‌గా పని చేస్తున్నారు. అంతకు ముందు పలు జిల్లాలకు కలెక్టర్‌గా, అలాగే, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంయుక్త కార్యదర్శిగా పని చేశారు.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది. సు దీర్ఘ కాలంగా ఇక్కడ పని చేస్తున్న ఆయనను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌గా, భూభారతి పీడీగా నియమించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో 2023 ఫిబ్రవరి 1న నిజామాబాద్ జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన రాజీవ్‌గాంధీ హనుమంతు సరిగ్గా రెండున్నరేండ్ల పాటు తనదైన శైలిలో విధులు నిర్వహించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కలెక్టర్ బదిలీపై ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ, తాజాగా ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
2012 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌గాంధీ హనుమంతును స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌గా, భూభారతి పీడీగా సర్కారు నియమించింది. నాలుగైదు రోజులుగా రాజీవ్‌గాంధీ హనుమంతు సెలవుల్లో ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో స్వతహా బదిలీ కోరుకున్నట్లు తెలిసింది. ప్రభుత్వ పథకాల అమలులో లోతైన సమీక్షలు, సమావేశాలు నిర్వహించిన రాజీవ్‌గాంధీ హనుమంతు.. అదే సమయంలో ఆయా శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి, అక్రమాలను నియంత్రించ లేకపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు పొరపాట్లు, తప్పులు చేసినప్పటికీ క్షమించి వదిలేసే వారని ఆయనకు పేరుంది.
ఉద్యోగులతో ఫ్రెండ్లీగా మసులుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో నిజామాబాద్ జిల్లాకు కలెక్టర్‌గా పని చేసిన ఆయన.. అసెంబ్లీ, లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికలను విజయవంతంగా నిర్వర్తించారు. గతంలో నారాయణరెడ్డి కలెక్టర్‌గా ఉన్నప్పుడు ప్రైవేటు దవాఖానల భరతం పట్టారు. ఆయన స్థానంలో వచ్చిన రాజీవ్‌గాంధీ హనుమంతు ఆ ఒరవడిని కొనసాగించలేకపోయారు. దీంతో ప్రైవేటు దవాఖానల ఇష్టారాజ్యం కొనసాగుతున్నది.