భారీ వర్షాలతో జిల్లా తడిసి ముద్దయ్యింది. జిల్లావ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం.. మంగళవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసింది. ఏకధాటిగా కురిసిన వానతో చెరువులు మత్తడి దుంకాయి. వాగులు, వంకలు వరద ఉధృతితో ఉప్పొంగి ప్రవహించాయి. పొలాల్లోకి వర్షపునీరు చేరి చెరువులను తలపించగా, పంటలు దెబ్బతిన్నాయి.
పలు గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 7
గాంధారి మండలంలో ముదెల్లి వాగు వంతెన పైనుంచి ప్రవహిస్తుండడంతో కామారెడ్డి- బాన్సువాడ రహదారిపై ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. గుజ్జుల్వాగు, ఈదుల్లావాగు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.
నిజాంసాగర్ మండలంలోని సింగీతం, కళ్యాణి, నిజాంసాగర్ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో రావడంతో నీటి పారుదల శాఖ డీఈఈ శ్రావణ్‌కుమార్, తహసీల్దార్ వేణుగోపాల్, ఏఈ శివ పరిశీలించారు. నల్లవాగు మత్తడి పొంగి పొర్లుతుండడంతో నాగమడుగు వద్ద రాకపోకలను నిలిపివేశారు. మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో పెంకుటిండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
పిట్లం మండలంలో వాగులు పొంగి పొర్లాయి. మండల కేంద్రం నుంచి బాన్సువాడ, నారాయణఖేడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. వరద పరిస్థితులను తహసీల్దార్ రామ్మోహన్‌రావ్, ఎస్సై రంజిత్ పర్యవేక్షించి హెచ్చరికలు జారీ చేశారు.
బిచ్కుంద మండలంలో చాలాచోట్ల పంట పొలాల్లోకి వర్షపునీరు చేరింది. కౌలస్నాలా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో పెద్ద దేవాడ వాగు పొంగి పొర్లుతున్నది.
లింగంపేట్ మండలంలో చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రామారెడ్డి మండలంలో చెరువులు అలుగు పారుతున్నాయి. గొల్లపల్లి గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయింది. అధికారులు బాధితులకు పునరావాసం కల్పించారు.
ఎల్లారెడ్డి పట్టణంలో మూడు ఇండ్లు కూలిపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరుగలేదు. మండల కేంద్రంలోని కొత్త చెరువు నిండడంతో తూము ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. మండలంలోని హాజీపూర్ తండా వద్ద ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై మర్రిచెట్టు కూలిపోవడంతో నాలుగైదు గంటలపాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తాడ్వాయి మండలంలో వాగులు పొంగడంతో బ్రాహ్మణపల్లి, కాలోజివాడి, సంగోజివాడి, చందాపూర్ గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టూ ఉన్న మూడు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో బ్రాహ్మణపల్లి గ్రామం సాయంత్రం వరకు జలదిగ్బంధంలో చిక్కుకున్నది. సంతాయిపేట భీమేశ్వరవాగు ఉధృతంగా పారింది. చందాపూర్, కాలోజివాడి వాగులను తహసీల్దార్ సునీత పరిశీలించారు.
నాగిరెడ్డిపేట్ మండలంలో పూర్తిగా నిండిన చెరువులను తహసీల్దార్ సయ్యద్ అహ్మద్ పరిశీలించారు. వదల్పర్తి పెద్ద చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని సర్పంచ్ ప్రవీణ్ వివరించడంతో బలోపేతం చేయించేలా నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు.
మద్నూర్ మండలంలో అక్కడక్కడా పాత ఇండ్లు కూలిపోయాయి. మారెపల్లి గ్రామంలోకి భారీగా వరదనీరు వచ్చింది. చిన్నటాక్లి వంతెన పైనుంచి నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గోజేగావ్, మహాధన్హిప్పర్గ, డోంగ్లి గ్రామాల వద్ద వాగులు నిండుగా ప్రవహించాయి.
బాన్సువాడ మండలంలో చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. బాన్సువాడ బల్దియా చైర్మన్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, విండో చైర్మన్ కృష్ణారెడ్డి పట్టణంలో పర్యటించి కాలనీలను పరిశీలించారు. కల్కి చెరువు అలుగు పారింది.
మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చింది. గజ్యానాయక్ తండా చెరువు మత్తడి దూకడంతో రోడ్డు పైనుంచి నీరు ప్రవహించింది. నెమ్లిగుట్ట తండా నుంచి సోమార్పేట, బంజపల్లి గ్రామాలకు వెళ్లేరోడ్డు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
రాజంపేట మండలంలో గుండారం వాగు, ఎల్లారెడ్డిపల్లిలోని పెద్దవాగు, రాజంపేటలోని మొండివాగు ఉధృతంగా ప్రవహించాయి. కొండాపూర్‌లోని చెరువు పొంగిపొర్లడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాజంపేట చెరువు అలుగు తెగిపోయింది.
బీబీపేట్ మండలంలోని మాందాపూర్ ఎడ్లకట్ట వాగు పొంగిపొర్లండతో ఆ నీరంతా బీబీపేట్ పెద్ద చెరువులోకి చేరుకుంటున్నది. ఎడ్లకట్ట వాగు వద్ద ప్రజలు చేపలు పట్టారు.
బీర్కూర్ మండలంలోని భైరాపూర్, అన్నారం, చించోలి, దామరంచ గ్రామాల్లో పలు ఇండ్లు కూలిపోయాయి. నాలుగు ఇండ్లు కూలిపోయినట్లు సమాచారం అందిందని, నీట మునిగిన పంటల వివరాలను సేకరిస్తామని రెవెన్యూ అధికారులు తెలిపారు.
నస్రుల్లాబాద్ మండలంలోని, నెమ్లి, మైలారం, అంకోల్, దుర్కి నస్రుల్లాబాద్ గ్రామాల చెరువులు పొంగిపొర్లాయి. అంకోల్, నెమ్లి వాగులు ఉధృతంగా ప్రవహించాయి. పొలాల్లో వర్షపు నీరు నిలిచింది.
కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పారుతోంది. దీంతో 8వ వార్డులో ఇండ్లల్లోకి, ప్రకృతి వనంలోకి నీరు చేరింది. ఎన్జీవోస్ కాలనీ, విద్యానగర్ కాలనీ, అయ్యప్పనగర్, సిరిసిల్ల రోడ్లో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. పలు కాలనీలు చెరువులను తలపించాయి.
దోమకొండ మండలంలో ఐదు ఇండ్లు కూలిపోయాయి. అంబారీపేట బ్రిడ్జిని తహసీల్దార్ మోతీసింగ్ పరిశీలించారు. ఆర్ఐ నరేందర్, సర్పంచులు అంజలి, సలీం తదితరులు గ్రామాల్లో పర్యటించి ప్రజలను హెచ్చరించారు.