నాగిరెడ్డిపేట, మార్చి 25: నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం తండాల మధ్య చిచ్చు రాజేసింది. తమ తండాలోనే భవనం నిర్మించాలని ఇరువురు పట్టుబట్టడం ఘర్షణకు దారి తీసింది. ఇరువురు తోపులాటకు దిగడంతో పోలీసులు వచ్చి చెదరగొట్టాల్సి వచ్చింది. నాగిరెడ్డిపేట మండలంలోని ఎర్రకుంట, బెజుగాం చెరువు తండా మధ్య, అలాగే, అక్కంపల్లి, కిచ్చెన్నపేట్ మధ్య భవన నిర్మాణ వివాదం చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది.
ఎర్రకుంట, బెజుగాం చెరువుతండాను కలుపుతూ నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. అప్పటినుంచి అద్దె భవనంలోనే గ్రామ పంచాయతీ కొనసాగింది. అయితే, సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో బెజుగం చెరువు తండాలో ఎంపీడీవో ప్రవీన్‌కుమార్, పీఆర్ ఏఈ పిచ్చయ్య, ఎంపీవో ప్రకాశ్ బుధవారం పనులు ప్రారంభించేందుకు వెళ్లారు. అయితే, నిర్మాణ స్థల విషయంలో ఎర్రకుంట, బెజుగం చెరువు తండా మధ్య వివాదం మొదలైంది. తమ తండాలోనే నిర్మించాలని ఇరువురు వాగ్వాదానికి దిగడంతో ఘర్షణకు దారి తీసింది. తోపులాటలో పలువు రికి గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మరోవైపు, అక్కంపల్లి, కిచ్చన్నపేట్ తండాల మధ్య కూడా ఇలాగే ఘర్షణ చోటు చేసుకున్నది. భవనం నిర్మించడానికి స్థలాన్ని చదును చేస్తుండగా మొదలైన వాగ్వాదం తోపులాటకు దారి తీసింది. గతంలో తాండూరు జీపీ పరిధిలో తాండూరు, అక్కంపల్లి, కిచ్చన్నపేట్ ఉండేవి. అయితే, పునర్విభజనలో భాగంగా కిచ్చన్నపేట్ మరో జీపీగా ఏర్పడింది. తాండూరు, అక్కంపల్లి జీపీకి నూతన భవనం మంజూరు కావడంతో అధికారులు బుధవారం పనులు ప్రారంభించేందుకు వెళ్లారు.
సర్వే నం.95/1లోని ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా, కిచ్చన్నపేట్ గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. అది తమ స్థలమని, ఎప్పటి నుంచో పెంటకుప్పలు వేస్తున్నామని అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టడంతో పాటు పరిస్థితులు అదుపు తప్పకుండా పికెటింగ్ ఏర్పాటు చేశారు.
తమ తండాలోనే భవన నిర్మాణం చేయాలని మంగళవారం గ్రామసభలో తీర్మాణం చేసినా, అధికారులు బెజుగాం చెరువుతండాలో ఎలా ప్రారంభిస్తారని ఎర్రకుంట తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ సర్పంచ్ భాస్కర్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేటకు చేరుకుని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. అధికారులు స్పందించక పోవడంతో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎస్సై భార్గవ్‌గౌడ్ వచ్చి అనుమతి లేకుండా ధర్నా చేయొద్దని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు.